ఉత్తరప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తమకు పెరోల్ వద్దు, జైల్లోనే ఉంటాం అంటూ 21 మంది ఖైదీలు ప్రాదేయపడుతూ ఉన్నతాధికారులకు లెటర్స్ రాశారు. 

ఉత్తరప్రదేశ్ లోని తొమ్మిది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు కరోనా వేళ జైలు కంటే సురక్షితం, ఆరోగ్యప్రదం మరొకటి లేదంటూ.. పెరోల్ తమకు వద్దని లేఖలు రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

యూపీలోని గజియాబాద్, గౌతంబుద్ధ్ నగర్, మేరఠ్, మహారాజ్ గంజ్, గోరఖ్ పుర్, లక్ నవు జైళ్లలోని ఖైదీలు ఈ మేరకు మొరపెట్టుకున్నట్లు జైళ్ల పరిపాలన శాఖ డైరెక్టర్ జరల్ ఆనంద్ కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ పరిస్థితుల్లో బైటికి వెడితే తిండి, ఆరోగ్యానికి భరోసా ఉండదు. ఇక్కడైతే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్సలు చేయిస్తాం. 

గంట కొట్టగానే అన్నం పెడతాం. పైగా వాళ్లకిచ్చే 90 రోజుల పెరోల్ కాలాన్ని మళ్లీ శిక్షాకాలంలో కలుపుతాం’ అని ఆయన వివరించారు. మరిప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. వాళ్లు లిఖిత పూర్వకంగా కోరారు కాబట్టి, ఆమోదించక తప్పదని చెప్పారు. 

కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో జైళ్లలో సామాజిక దూరం సమస్యగా మారుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఏడేళ్లలోపు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, కేసులు విచారణలో ఉన్నవారికి పెరోల్ లేదా మధ్యంతర బెయిలు మంజూరు చేసే విషయం పరిశీలించాలని సుప్రీం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

ఈ ఆదేశాలకు అనుగుణంగా యూపీలో 2,200 మందిని పెరోల్ మీద, 9,200మందిని మధ్యంతర బెయిల్ మీద విడుదల చేసినట్లు ఆనంద్ కుమార్ తెలిపారు.