క్యాండీ క్రష్ నాకు ఇష్టమైనది.. : వైరల్ ఫొటోపై బీజేపీ విమర్శలపై స్పందించిన సీఎం బఘేల్
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అక్కడ రాజకీయం మరింతగా వేడెక్కింది. రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అక్కడ రాజకీయం మరింతగా వేడెక్కింది. రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పార్టీ మీటింగ్‌లో తన ఫోన్‌లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నట్లు ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కాస్తా కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. భూపేష్ బఘేల్ తన ఫోన్‌లో క్యాండీ క్రష్ ఆడుతున్న ఫొటోను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసిన బీజేపీ నేత అమిత్ మాల్వియా.. ఆయనపై విమర్శలు గుప్పించారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నిశ్చింతగా ఉన్నారని, ఎంత పోరాడినా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాదని ఆయనకు తెలుసనని అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే కీలక సమావేశంలో క్యాండీ క్రష్ ఆడటంపై దృష్టిపెట్టాలని బఘేల్ భావించారని సెటైర్లు వేశారు.
అయితే బీజేపీ చేస్తున్న విమర్శలపై స్పందించిన భూపేష్ బఘేల్.. క్యాండీ క్రష్ తనకు ఇష్టమైనదని పేర్కొన్నారు. తాను ఈ గేమ్‌లో మంచి స్థాయిని అధిగమించానని చెప్పారు. గతంలో తాను బండి నడపడం, గిల్లీ దందా ఆడడం, రాష్ట్రంలో ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్స్ నిర్వహించడం వంటి ప్రతి పనికి బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉందని విమర్శించారు.
అయితే నిన్న మీటింగ్‌కు ముందు తాను క్యాండీ క్రష్ ఆడుతున్న ఫోటో వచ్చిందని.. దీనిపై ఇప్పుడు బీజేపీ అభ్యంతరం వ్యక్తం చెబుతుందని అన్నారు. నిజానికి తన ఉనికి పట్ల వారికి అభ్యంతరం ఉందని చెప్పారు. అయితే ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించేది ఛత్తీస్‌గఢ్ ప్రజలేనని అన్నారు. అలాగే తాను క్యాండీ క్రష్ ఆడుతున్న ఫొటోను కూడా బఘేల్ షేర్ చేశారు.
ఇక, ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశలో 20 స్థానాలకు నవంబర్ 7న, మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న రెండో దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను ప్రకటన ఉండనుంది.