జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేషన్‌కు అవమానకరం.. పీఎంవో ఆఫీసర్‌గా మోసం చేసిన ఘటనపై ఫరూఖ్
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేషన్ ఓ మోసగాడికి అధికారిక హోదాలో పర్యటనకు అన్ని ఏర్పాటు చేసింది. భద్రతను కూడా కల్పించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై ఎన్సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా విస్మయం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిగా జమ్ము కశ్మీర్ అధికారులను నమ్మించి ఓ వ్యక్తి అధికార హోదాలో పలుమార్లు పర్యటించిన ఘటన సంచలనంగా మారింది. ఆ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బయటకు రావడంతో జమ్ము కశ్మీర్‌లో రాజకీయ దుమారం రేగింది. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా ఈ ఉదంతం పై విస్మయం వ్యక్తం చేశారు. ఇది జమ్ము కశ్మీర్‌లోని లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేషన్‌కు అవమానకరం అని అన్నారు.
మోసగాడు కిరణ్ భాయ్ పటేల్ ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా నమ్మించాడు. జమ్ము కశ్మీర్‌కు వెళ్లాడు. సాధారణ ప్రజలకు వీలు లేని ఎల్‌వోసీ సమీప ప్రాంతాల్లోనూ అతడు జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కల్పించిన సెక్యూరిటీ కవర్‌తో పర్యటించాడు. పలుమార్లు అధికారికంగా పర్యటనలు చేశాడు.
‘ఇది చాలా సీరియస్ విషయం. జమ్ము కశ్మీర్ చాలా సున్నితమైన ప్రాంతం. ఇంతటి లోపం ఎలా చోటుచేసుకుంది? ఇది లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేషన్‌కు అవమానకరం’ అని ఫరూఖ్ అబ్దుల్లా ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ కామెంట్ చేశారు.
‘కిరణ్ పటేల్‌కు అన్ని అధికారిక సదుపాయాలు కల్పించేటప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ యంత్రాంతం క్షుణ్ణంగా పరిశీలించాల్సింది. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి దర్యాప్తును ఆదేశించాలి. దీనికి ఎవరు బాధ్యులనేది గుర్తించాలి. ఆ మోసగాడికి భద్రత, ఇతర సదుపాయాలు కల్పించడిన అధికారులపై యాక్షన్ తీసుకోవాలి’ అని అన్నారు.