Itanagar: అరుణాచల్ ప్రదేశ్‌లోని పురాతన మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఈ అగ్ని ప్ర‌మాదంలో  కనీసం 700 దుకాణాలు దగ్ధమయ్యాయ‌ని స‌మాచారం. ఇది రాష్ట్ర రాజ‌ధాని ఇటాన‌గ‌ర్ కు స‌మీపంలో ఉంది.  

Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రమైన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో మంగ‌ళ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 700 ల‌కు పై గా దుకాణాలు కాలిబుడిద‌య్యాయ‌ని పోలీసులు తెలిపారు. అయితే, ఈ అగ్నిప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణన‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

ఈ అగ్నిప్ర‌మాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. మంగళవారం ఉదయం ఆరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాజ‌ధాని ఇటానగర్ సమీపంలోని నహర్లాగన్ డైలీ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 700 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు పేర్కొన్నారు. 

Scroll to load tweet…

అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఫైర్ స్టేషన్, నహర్లగున్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ మార్కెట్ ఉంది. దీపావళి వేడుకలకు బాణాసంచా కాల్చడం లేదా దీపాలు వెలిగించడం వల్ల మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు, కానీ దుకాణాలను వెదురు, కలపతో తయారు చేయడంతో, మార్కెట్లో అధికంగా నిల్వ చేసిన పొడి వస్తువుల కార‌ణంగా మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు చెప్పారు. అయితే, ఎల్పీజీ సిలిండర్లు పేలడం వల్ల భయాందోళనకు గురైన దుకాణదారులు... మంట‌ల‌ను ఆర్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ సిలిండ‌ర్ల పెలుడు మంట‌ల‌ను మ‌రింత‌గా పెంచాయి. 

ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బంది స‌మాచారం అందించారు. వెంట‌నే మూడు అగ్నిమాపక యంత్రాలు అక్క‌డి చేరుకుని గంట‌ల త‌ర‌బ‌డి శ్ర‌మించి మంట‌ల‌ను ఆర్పాయి. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని కచ్చితమైన అంచనా వేస్తున్నామని, అయితే కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుందని అంచనాలున్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అగ్నిమాపక శాఖ దర్యాప్తు పూర్తయిన తర్వాత అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రాజధాని) జిమ్మీ చిరామ్ తెలిపారు. మొద‌ట మంటలను గమనించిన దుకాణదారులు పక్కనే ఉన్న అగ్నిమాపక కేంద్రానికి స‌మాచారం అందించిన‌ప్ప‌టికీ.. అవి వ‌చ్చేస‌రికి మంట‌లు పెద్దఎత్తున చెల‌రేగాయ‌నీ, అలాగే, మంట‌ల‌ను ఆర్ప‌డానికి స‌రిప‌డా నీళ్లు అగ్నిమాపక యంత్రాల్లో నీళ్లు లేవని స్థానికులు తెలిపారు. ఇంజిన్‌లను రీఫిల్ చేయడానికి, సిబ్బంది చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చిందని స‌మాచారం. దాదాపు గంట త‌ర్వాత నీటిని రీఫిల్ చేసుకుని వ‌చ్చిన త‌ర్వాత‌... అప్ప‌టికే మార్కెట్‌లో చాలా భాగం కాలిపోయిందని దుకాణదారులు ఆరోపించారు.

పోలీసులు కూడా చర్యలు తీసుకోలేదని.. విధులు నిర్వర్తించడంలో విఫలమైన వారందరినీ సర్వీసు నుంచి తొలగించాలని నహర్లగన్ బజార్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిపా నాయ్ అన్నారు. దుకాణదారులతో మాట్లాడిన తర్వాత, అరుణాచల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ACC&I) అధ్యక్షుడు తార్ నాచుంగ్ విధుల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బందిని నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. క్యాపిటల్ కాంప్లెక్స్‌లోని వివిధ ప్రదేశాలలో వెంటనే అందుబాటులోకి తీసుకురావాల్సిన వాటర్ ఫిల్లింగ్ పాయింట్ల వంటి అగ్నిమాపక చర్యలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆయన అన్నారు. రాజధాని నడిబొడ్డునే ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.