ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఢిల్లీ, ముంబైలోని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలలో సర్వే కొనసాగిస్తున్నారు. మంగళవారం మొదలైన ఈ ఆపరేషన్ నేటితో మూడో రోజుకు చేరింది. 

ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఢిల్లీ, ముంబైలోని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలలో సర్వే కొనసాగిస్తున్నారు. మంగళవారం మొదలైన ఈ ఆపరేషన్ నేటితో మూడో రోజుకు చేరింది. బీబీసీ కార్యాలయాల్లో సర్వే కొనసాగుతుందని ఐటీ అధికారులు తెలిపారు. ఈ కసరత్తు మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అధికారులు బుధవారం చెప్పారు. ఆపరేషన్‌ పూర్తి అవడానికి ఎంత సమయం పడుతుందనే క్షేత్రస్థాయిలో ఉన్న జట్లపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. బీబీసీ అనుబంధ కంపెనీల అంతర్జాతీయ పన్నులు, బదిలీ ధరలకు సంబంధించిన అంశాలను పరిశోధించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలపై సర్వే బృందాలు సమాధానాలు కోరుతున్నాయని అధికారులు చెప్పినట్టుగా పీటీఐ పేర్కొంది. సాక్ష్యాలను సేకరించే పనిలో భాగంగా సర్వే బృందాలు.. కంపెనీ కార్యాలయాల్లోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుంచి డేటాను కాపీ చేస్తున్నాయని ఐటీ అధికారులు తెలిపారు. 

ఇదిలా ఉంటే.. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ పేరుతో బీబీసీ రెండు భాగాలతో కూడిన డాక్యూమెంటరీని యూకేలో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని వారాలనే బీబీసీపై ఐటీ శాఖ సర్వే చేపట్టడాన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. బీజేపీ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నాయి. ఇక, తాము ఐటీ అధికారులు సహకారిస్తున్నట్టుగా బీబీసీ తెలిపింది. తమ వార్తలను యధావిధిగా ప్రసారం చేస్తున్నామని ఢిల్లీలోని బీబీసీ సిబ్బంది తెలిపారు.

ఇక, వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో భారతదేశంలో బిబిసిపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసింది. ఆ పిటిషన్‌ను పూర్తిగా యోగ్యత లేనిదని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డాక్యుమెంటరీ యాక్సెస్‌ను నిరోధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌పై ఏప్రిల్‌లో విచారణ జరగనుంది. ఇక, జనవరి 21న బీబీసీ డాక్యుమెంటరీకి లింక్‌లను పంచుకునే యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్‌లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.