హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఏకమైనప్పుడు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా భారత్‌లో విలీనం కావడం సాధ్యమేనని వివరించారు. ఈ సందర్భంగా పొరుగు దేశాలతో పోలుస్తూ భారత గొప్పదనాన్ని ఆయన వర్ణించారు.
న్యూఢిల్లీ: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగునే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో విలీనం చేయడం సాధ్యమే అని అన్నారు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలను కలుపడం సాధ్యమైనప్పుడు.. ఇది కూడా సాధ్యమే అని వివరించారు. బీజేపీ నేషనల్ మైనారిటీ మోర్చా శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మనోహర్ లాల్ ఖట్టార్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆయన భారత్ చుట్టూ ఉన్న దేశాల దుస్థితిని ప్రస్తావించినట్టు ది ప్రింట్ అనే సంస్థ ఓ కథనంలో పేర్కొంది. మన దేశం ప్రజాస్వామిక దారిలో వెనుకబడిన తరగతులకు చెందిన ఒక మహిళను రాష్ట్రపతి చేసిందని, పొరుగు దేశాలతో పోల్చుతూ ఇది కేవలం భారత్‌కే సాధ్యం అని అన్నారు. ఇక్కడ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా శాంతియుతంగా ప్రమాణం తీసుకుంటూ ఉండగా.. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో ఘర్షణలు జరుగుతున్నాయని తెలిపారు. శ్రీలంకను పరోక్షంగా పేర్కొంటూ ఒక దేశ అధ్యక్షుడు పారిపోవాల్సి వచ్చిందని చెప్పారు.
బీజేపీ ప్రధాన లక్ష్యం భారత్‌ను విశ్వగురువు చేయడమేనని వివరించారు. దేశ విభజన చాలా బాధాకరమైన ఘట్టం అని మనోహర్ లాల్ ఖట్టార్ తెలిపారు. మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారికి మైనార్టీ ట్యాగ్ ఇచ్చామని, తద్వార వారు అభద్రతా భావానికి లోను కాకుండా నివారించగలిగామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ మాత్రం సంఘ్‌ను చూపిస్తూ మైనార్టీల్లో భయాందోళనలు సృష్టించిందని వివరించారు. కానీ, మెల్లమెల్లగా మైనార్టీలు ఇప్పుడు అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారని అన్నారు. వారు క్రమంగా బీజేపీ మాట, చేతలను అర్థం చేసుకోగలుగుతున్నారని, అలాగే, కాంగ్రెస్ ఆలోచనలు, ఐడియాలజీని కూడా అర్థం చేసుకుంటున్నారని వివరించారు. భారత మాత నినాదాలతోనూ కాంగ్రెస్ కలత చెందుతుందని అన్నారు.
1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు దక్కాయని సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ వివరించారని మైనార్టీ మోర్చా అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నట్టు ది ప్రింట్ రాసింది. ఆ తర్వాత 12 సంవత్సరాలకు అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడిందని ఆ ప్రకటన పేర్కొంది. ఇతర పార్టీలపై ఆధారపడినప్పటికీ అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిందని వివరించింది. అనంతరం 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపింది. మోడీ నినాదం ఒకటే.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అని వివరించారని ఆ ప్రకటన పేర్కొంది.
