Aditya-L1: భూగ్రహ ప్రభావం నుంచి బయటకు.. సూర్యుడి వైపు ఆదిత్య ఎల్1 ప్రయాణం: ఇస్రో
ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా భూగ్రహ ప్రభావం నుంచి బయటపడిందని ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇప్పుడు భూమికి, సూర్యుడికి మధ్యనున్న లగ్రాంజ్ పాయింట్ 1 వైపుగా ఈ రోదసి నౌక ప్రయాణం చేస్తున్నదని తెలిపింది. భూగ్రహ ప్రభావం నుంచి ఒక రోదసి నౌకను బయటకు పంపడం ఇస్రోకు ఇది రెండోసారి.
న్యూఢిల్లీ: భారత్ సూర్యుడి గురించి పరిశీలనలు చేయడానికి ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ భూగ్రహ ప్రభావం నుంచి బయటకు వెళ్లింది. భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి.. భూమి ప్రభావం నుంచి బయటకు వెళ్లినట్టు ఇస్రో తాజాగా వెల్లడించింది.
భూగ్రహ ప్రభావం నుంచి ఒక రోదసి నౌకను బయటకు పంపడం ఇస్రోకు ఇది రెండోసారి. గతంలో మార్స్ పైకి స్పేస్ క్రాఫ్ట్‌ను పంపినప్పుడూ అది భూగ్రహ ప్రభావం నుంచి పూర్తిగా బయటకు వెళ్లింది.
తాజాగా ఇస్రో ట్విట్టర్‌లో ఆదిత్య ఎల్-1 అప్‌డేట్ ఇచ్చింది. భూమి నుంచి ఈ రోదసి నౌక 9.2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిందని వివరించింది. విజయవంతంగా భూగ్రహ ప్రభావం నుంచి బయటపడిందని తెలిపింది. ఇప్పుడు ఈ నౌక సూర్యుడి వైపు ప్రయాణిస్తున్నదని పేర్కొంది. లగ్రాంజ్ పాయింట్ 1 వైపుగా ప్రయాణం సాగుతున్నదని వివరించింది.
సూర్యుడి పొరలను పరిశీలించే లక్ష్యంతో ఆదిత్య ఎల్-1ను ఇస్రో ప్రయోగించింది.