వచ్చే నెల 13వ తేదీన చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ప్రయోగం ఉంటుంది. ఈ మిషన్‌లో రోవర్, ల్యాండర్‌ ఉంటుంది. ఆర్బిటర్‌కు బదులు ప్రపల్షన్ మాడ్యుల్ ఉండనుంది. 

హైదరాబాద్: ఎంతో మంది ఎదరుచూస్తున్న ప్రకటన రానే వచ్చేసింది. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగంపై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రకటించింది. జులై 13వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగం ఉంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగిస్తారు. ఈ మిషన్ బడ్జెట్ 615 కోట్ల డాలర్లు.

2019లో చంద్రయాన్ 2 మిషన్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. మిషన్ సక్సెస్ అయినా.. ఫలితాలు మాత్రం దక్కలేదు. ఎందుకంటే చంద్రయాన్ 2 మిషన్ ప్రయోగించిన తర్వాత చంద్రుడి చుట్టూ తిరగాల్సిన ఆర్బిటర్ విజయవంతమైంది. అదే అయితే, రోవర్‌ను చంద్రుడిపై ల్యాండ్ చేయాల్సిన విక్రమ్ ల్యాండర్‌ సరిగా ల్యాండ్ కాలేదు. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ల్యాండర్ దెబ్బతిన్నది. రోవర్ ఆపరేషన్స్ ప్రారంభించకుండానే ముగిసిపోయాయి.

ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రమాదాన్నీ నివారించేలా శాస్త్రవేత్తలు, నిపుణులు చంద్రయాన్ 3 మిషన్ రూపకల్పన చేశారు. ఈ మిషన్ 3 ప్రాథమిక లక్ష్యం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ కావడం, రోబాటిక్ రోవలర్ కంట్రోల్‌ను మనం చేయగలగడం ఉన్నాయి. ఈ మిషన్‌తో చంద్రుడి గురించి మరిన్ని విషయాలు మనకు తెలిసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

ఈ మిషన్ కోసం భారీ ఉపగ్రహాలను లేదా అత్యధిక బరువుగల శాటిలైట్లను మోసుకెళ్లడానికి ఉపయోగించే జీఎస్‌ఎల్వీని ఉపయోగిస్తున్నారు. చంద్రయాన్ 3పై పరీకష్లు నిర్వహించారు. దాని సామర్థ్యం, పని తీరులను పలుమార్లు పరీక్షించారు. గత ట్రిప్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ తీరులో కొంత మార్పు చేర్పులు చేసినట్టు అధికారులు వివరించారు.

Also Read: నా వృషణాలు నొక్కి చంపాలనుకున్నాడు.. వ్యక్తి ఫిర్యాదు.. అలా నొక్కి గాయపరచడం హత్యాయత్నం కాదు: హైకోర్టు

ఈ సారి మిషన్ సక్సెస్ కావడానికి ఇస్రో గణనీయమైన ఇంప్రూవ్‌మెంట్లు చేపట్టింది. చంద్రయాన్ 2 లాగే.. చంద్రయాన్ 3లోనూ ల్యాండర్, రోవర్‌ను పంపిస్తున్నారు. అయితే..ఇందులో ఆర్బిటర్‌ ఉండదు. దీనికి బదులు ప్రపల్షన్ మాడ్యూల్ ఉంటుంది. ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్‌గా పనికి వస్తుంది. చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరపు కక్ష్యలోకి వెళ్లే దాకా ఇది పని చేస్తుంది.

ఈ మిషన్‌లోని స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హాబిటేబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) ప్లేలోడ్ పంపిస్తున్నారు. ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతూనే భూమికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను శాస్త్రవేత్తలకు అందించనుంది.

చంద్రయాన్ 3 ప్రధానమైన మూడు లక్ష్యాలు ఏమిటంటే.. ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా, సాఫ్ట్‌గా దిగిపోవాలి, చంద్రుడి ఉపరితలంలపై రోవర్ నిలిచి, తిరిగే సామర్థ్యాన్ని చూపించాలి, శాస్త్రజ్ఞులు అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి పరిశోధనలు చేయడం. చంద్రుడి ఉపరితలంపైని మట్టి, నీరు, రసాయన పదార్థాల గురించి పరిశీలించడం ఈ మిషన్ ముఖ్యమైన లక్ష్యాల్లో ఉన్నాయి.

ఈ ప్రయోగం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ఎంతో ముఖ్యమైనది. చంద్రుడుపై అన్వేషణ, ఇతర బయటి గ్రహాల గురించిన అన్వేషణకు ఈ మిషన్ ద్వారా మరికొంత నైపుణ్యం దక్కనుంది.