చంద్రయాన్-3 మిషన్‌తో సహా పలు రాకెట్ ప్రయోగాల కౌంట్‌డౌన్‌ వేళలలో తన స్వరాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు.

భారతదేశ జనాభా 1.4 బిలియన్లు.. అయినప్పటికీ కొద్దిమంది ప్రజల గొంతులు మాత్రమే శాశ్వతంగా ప్రజల మనస్సులలో నిలిచి పోతాయి. ఈ జాబితాలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులతో పాటు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. 

ఇస్రో రాకెట్ ప్రయోగాల వేళ అత్యంత ప్రధాన ఘట్టం కౌంట్ డౌన్. మొత్తం దేశాన్ని ఒకచోట చేర్చే ఐకానిక్ ఈవెంట్‌ ఇది. ప్రయోగాన్నిప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి కోట్లాది మందిని టీవీలు, సెల్ ఫోన్లు పట్టుకునే చేసింది కూడా ఈ కౌంట్ డౌన్ వాయిసే. అయితే.. ఈ కౌంట్ డౌన్ వేళ వినిపించే గంభీరమైన స్వరం మూగబోయింది. 

శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ వేళ తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి గొంతు మూగబోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మరణించారు. ఆమె చంద్రయాన్-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలను నిర్వర్తించారు.