మార్స్ మీదికి వెళ్లే సత్తా కూడా భారత్‌కు ఉన్నదని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు. అయితే, ఇన్వెస్ట్‌మెంట్ మరింత పెంచాలని వివరించారు. మార్స్, వీనస్ మీదికి కూడా వెళ్లే సామర్థ్యాలు ఇండియాకు ఉన్నాయని శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. 

తిరువనంతపురం: చంద్రుడి మీదికే కాదు.. మార్స్, వీనస్ మీదికి వెళ్లే సత్తా కూడా భారత్‌కు ఉన్నదని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని సంపూర్ణంగా సాధించడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ అన్నారు.

‘చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల పైకీ వెళ్లే సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ఇందుకోసం మనం మన కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. ఇంకా పెట్టుబడులు అవసరం. అంతరిక్షం రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి. ఈ విధంగా దేశమంతా అభివృద్ధి చెందగలదు. ఇదే మా మిషన్. పీఎం మోడీ తమకు ఇచ్చి విజన్‌ను పూర్తి చేయగలం’ అని తిరువనంతపురంలో విలేకరుల సమావేశంలో శనివారం రాత్రి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు.

Also Read: అసోంలోని ఈ గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తున్నది. ఎందుకో తెలుసా?

ప్రధాని మోడీ శనివారం ఉదయం ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి చంద్రయాన్ 3లో భాగస్వామ్యం పంచుకున్న సైంటిస్టులను ప్రశంసించారు. భారత కృషి ఈ విజయానికి నిదర్శనం అని అన్నారు. ఏ అపజయమైనా అంతిమం కాదనే సత్యాన్ని ఈ విజయం మనకు గుర్తు చేస్తుందని వివరించారు.