హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా తక్కువ ఖర్చుతో ఇస్రో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిందనీ, చంద్రయాన్-3 విషయంలో కూడా  అదే సంప్రదాయాన్ని కొనసాగించిందని ఇస్రో మాజీ చీఫ్ కె శివన్ అన్నారు.

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని దశలను ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసిన చంద్రయాన్ 3 చివరి ఘట్టంలోకి ప్రవేశించింది. చంద్రుడికి మరింత చేరవయ్యే క్రమంలో ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ విడిపోయింది.

ప్రస్తుతం ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ.. చంద్రుడిని అత్యంతం సమీపంగా పరిశీలిస్తుంది. ఫోటోలు తీసి.. ఇస్రోకు పంపిస్తోంది. చంద్రయాన్-3ని జూలై 14న ప్రయోగించగా.. ఆగస్టు 23న ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు.. రష్యా తన చంద్ర మిషన్ లూనా-25ను ఆగస్టు 10న ప్రారంభించింది. ఇది ఆగస్టు 21న చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ కానున్నది.

ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3 మిషన్‌పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)మాజీ అధిపతి కె శివన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో చేపట్టే 'మార్స్ మిషన్' ఖర్చు నిస్సందేహంగా హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా రెట్లు తక్కువ బడ్జెట్ లో ప్రయోగాలు చేస్తుందనీ,చంద్రయాన్-3 విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించిందని అన్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి మిషన్‌ల కోసం మరిన్ని నిధులు,పెద్ద రాకెట్‌ల కోసం మనం మార్గాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇస్రో మాజీ చీఫ్ కె శివన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్ర మిషన్, చంద్రయాన్-3కి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

మాజీ ఇస్రో చీఫ్ ఇంకా మాట్లాడుతూ.. మనకు (ఇస్రో)కు హై-పవర్ రాకెట్లు, ఉన్నత స్థాయి సాంకేతికత కూడా అవసరమని అన్నారు. ఖర్చుతో కూడిన ఇంజనీరింగ్‌పై మనం ఆధారపడలేమని, మనం అంతకు మించి ఆలోచించాలని అన్నారు. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తోందనీ, ఇది చాలా మంచి విషయమనీ, ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో అంతరిక్ష కార్యకలాపాలను అనుసంధానం చేస్తోందని తెలిపారు. ప్రైవేట్ పరిశ్రమలు అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి చూపుతున్నాయని ఇస్రో మాజీ చీఫ్ చెప్పారు. దాని ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయనీ, త్వరలో వారు హై-ఎండ్ టెక్నాలజీని కూడా అవలంబిస్తారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నాననీ, ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది ఉండదని తాను భావిస్తున్నానని తెలిపారు. 

గగన్‌యాన్ మిషన్ భారతదేశ ఆశయానికి మరింత ఊతం ఇస్తుందనీ, దీని ద్వారా.. భారతదేశం తన మొదటి మానవ సహిత స్పేస్‌క్రాఫ్ట్ మిషన్‌ను ప్రారంభిస్తోందని తెలిపారు. ఈ సాంకేతికత నిరూపించబడిన తర్వాత చంద్రునిపై అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చని ఆశ భావం వ్యక్తం చేశారు. ఆ తరువాత చంద్రునిపై శాశ్వత మానవ నివాసం, అనేక ఇతర విషయాల గురించి ఆలోచించవచ్చని తెలిపారు. 

ఇదే సమయంలో చంద్రయాన్-1 గురించి ప్రస్తావించారు. 2009లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 ద్వారా చంద్రునిపై నీటిని కనుగొన్నామనీ, ప్రయోగ అనుభవాలను పంచుకున్నారు. చంద్రయాన్-1 విజయం నిజంగా ఇస్రో కమ్యూనిటీకి ఓ ఉత్తేజకరమైన క్షణమని ,అంతకంటే.. సంతోషకరమైన విషయం ఏముంటుందని అన్నారు. ప్రయోగ సమయంలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి), ఆ తర్వాత జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్‌ఎల్‌వి) ఉపయోగించారు. 

ఇటీవలీ ప్రయోగాల్లో ఉపయోగిస్తున్న లాంచ్ వెహికల్ మార్క్-III (LVM3) వినియోగంపై ఇస్రో మాజీ చీఫ్ మాట్లాడుతూ.. అంతరిక్ష వ్యవస్థల కోసం అది రాకెట్ లేదా అంతరిక్ష నౌక అయినా.. వాటి విజయం నాణ్యత , విశ్వసనీయత అనే రెండు విషయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్ భవిష్యత్తు అవసరమని అన్నారు. 

పాశ్చాత్య దేశాల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ భారతదేశం క్రయోజెనిక్ ఇంజిన్‌లను అభివృద్ధి చేయడంపై స్పందించారు. మిషన్ ప్రాముఖ్యత, పేలోడ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇటువంటి ఇంజిన్‌లు కూడా అవసరమని ఇస్రో మాజీ చీఫ్ అన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్లను ఉపయోగించడం వల్ల ఉపగ్రహాల ద్రవ్యరాశి తగ్గుతుందనీ, అందుకే తాము (ఇస్రో) స్వంతంగా క్రయోజెనిక్ ఇంజిన్‌లను అభివృద్ధి చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.

అలాంటి ఇంజిన్‌లను తయారు చేయడానికి ఇస్రో రష్యన్‌లతో కలిసి పనిచేస్తుందనీ, ఇప్పుడు తాము కొత్త,అధిక శక్తి గల క్రయోజెనిక్ ఇంజిన్‌లను అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ ఇంజన్ల సామర్థ్యం చాలా బాగుందని తెలిపారు. దీనితో పాటు.. ఇస్రో తాజాగా సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీపై పని చేస్తుందని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. స్త్రీ, పురుషులకు ఇస్రో సమాన అవకాశాలు కల్పిస్తోందని శివన్ అన్నారు. భారతీయ యువకులు శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా వారు తమ ఆవిష్కరణలతో భవిష్యత్తులో దేశానికి సహాయం చేయగలరని ఆయన కోరారు.