దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి చుట్టూ చర్చ జరుగుతున్నది. షరియా చట్టాలు మార్చడానికి వీలు లేనివా? అవి పవిత్రమైనవా? ముస్లిం దేశాలు తరుచూ తమ చట్టాలను మార్చుకుంటున్నప్పుడు భారత్‌లో ఎందుకు ఈ జంకు?
న్యూఢిల్లీ: భారత్ బహుళత్వ సమాజానికి నిదర్శనం. కానీ, పౌరులందరికీ సమాన చట్టాలు ఉండాల్సిందే. అందుకే భారత రాజ్యాంగలోని 44వ అధికరణం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని సూచిస్తున్నది. ఇది మన దేశంలో చర్చనీయాంశమైంది. అయితే, చాలా వరకు పౌర చట్టాలు, క్రిమినల్ చట్టాలు దేశమంతటా ఒకేలా ఉన్నాయి. కేవలం పర్సనల్ లా మాత్రమే ఒక్కో మతానికి ఒక్కో తీరు ఉన్నాయి. ఈ పర్సనల్ చట్టాలు పెళ్లిళ్లు, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాలను కవర్ చేస్తాయి. ఉదాహరణకు ముస్లింలకు 1936 ముస్లిం పర్సనల్ లేదా షరియత్ అప్లికేషన్ యాక్ట్ కింద ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.
కొన్ని సాంప్రదాయాలు, రీతులు, నిబంధనల సమాహారమే షరియా. దీన్నే చాలా మంది ముస్లింలు ఆచరిస్తారు. కేవలం పర్సనల్ లా తప్పితే.. ఇతర చట్టాలు దేశ పౌరులందరికీ కామన్. దురదృష్టవశాత్తు సరైన అవగాహన లేక, లేదా అనవసర భయాలతో కొందరు తప్పు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. షరియాను, పర్సనల్ చట్టం 1937 రెండూ ఒకటే అనే అవాస్తవ అభిప్రాయంలో ఉన్నారు. వీటిని మార్చడం కుదరదనే అభిప్రాయాన్ని బలంగతా కలిగి ఉన్నారు. కానీ, గడుస్తున్న కాలానికి అనుగుణంగా ముస్లిం దేశాలు, ప్రజాస్వామిక దేశాలు, షరియా ఆధారంగా నడిచే దేశాలూ ఈ ఇస్లామిక్ చట్టాలను సవరించుకుంటున్నాయి.
ముస్లిం దేశాల్లోనూ ఇస్లామిక్ చట్టాల్లో మార్పులు పెద్ద గందరగోళానికి దారితీస్తున్నాయి. వివాదాస్పదంగా మారుతుంటాయి. షరియా నిబంధనలను, ఆధునిక న్యాయ వ్యవస్థ, మానవ హక్కులను సంతులనం చేయడం ఇక్కడ కష్టతరమైన పని. షరియా మౌళికంగా ఖురాన్, సున్నా(ముహమ్మద్ ప్రవక్త ఆచరణ, బోధనలు), ఫిక్ (ముస్లిం మేధావుల సమాలోచనల ఆధారంగా షరియాపై జరిపే చర్చ) ఆధారంగా రూపొందింది. ఇందులో కేవలం న్యాయపరమైన నిబంధనలే కాదు.. నైతిక ఆధ్యాత్మిక సూత్రాలూ ఉంటాయి. అయితే, షరియాను మార్చడానికి వీలుకాదని ముస్లింలు సాధారణంగా భావిస్తారు. కానీ, ఇది పవిత్రమైనదేమీ కాదు, పరివర్తనం చెందానికి ఆస్కారం లేనిదేమీ కాదు, యూనివర్సల్ కానే కాదు. ఇది కూడా పరిణామం చెందే సాంప్రదాయమే. భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
చాలా దేశాల్లోనూ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఫిక్ ఆధారంగా రూపొందించిన షరియాలో అనేక తేడాలు కనిపిస్తాయి. దాని అమల్లోనూ ఆ వ్యత్యాసాలు చూడొచ్చు. సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాల్లో చట్టాలు షరియాపై ఆధారపడి ఉంటాయి. అదే ఈజిప్టు, పాకిస్తాన్‌లలో షరియా చట్టం, పౌర చట్టాల సమ్మిళిత వ్యవస్థ కనిపిస్తుంది. అదే టర్కీ, ట్యూనిషియా వంటి దేశాల్లో లౌకిక న్యాయవ్యవస్థను చూడొచ్చు. ఇక్కడ షరియా ప్రభావం అత్యల్పం.
ఇటీవలి సంవత్సరాల్లో ముస్లిం దేశాల్లో ఫ్యామిలీ లాను సంస్కరించడం పెద్ద సవాల్‌గా మారిపోయింది. ఈ సంస్కరణలు మహిళా హక్కులు, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, విడాకుల హక్కులు, సమాన వారసత్వ హక్కులను ఉద్దేశిస్తాయి. కానీ, ఈ సంస్కరణలకూ కొందరు సంప్రదాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ సంస్కరణలు షరియా అధికారాన్ని, ఇస్లాం నిబంధనలనే అతిక్రమిస్తున్నాయనేది వారి వాదన. అయితే, మహిళలకు పెళ్లిలో హక్కులు పెంచడం, విడాకులు, వారసత్వం, దత్తత, గృహ హింస నుంచి రక్షించడం వంటి సంస్కరణలు క్రమంగా కొనసాగుతున్నాయి. ఈ సంస్కరణలు అటు షరియా చట్టాన్ని అంగీకరిస్తూనే లింగ సమానత్వం, సామాజిక న్యాయాన్ని ఎత్తిపడుతున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.
Also Read: భారత్‌లో ఐదు రోజులు పర్యటించనున్న ఎండబ్ల్యూఎల్ చీఫ్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీం అల్ ఇసా
భారత పొరుగు దేశం పాకిస్తాన్ 1961 ముస్లిం ఫ్యామిలీ లా ఆర్డినెన్స్‌లో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నది. బహుభార్యత్వం కోసం భార్య నుంచి రాతపూర్వక సమ్మతి తీసుకోవడం, న్యాయబద్ధంగా విడాకులు తీసుకోవడానికి కోర్టులు ఏర్పాటు చేయడం, వీటి ద్వారానే కుటుంబ కలహాలను పరిష్కరించుకోవడం వంటివి అమలు చేస్తున్నది. రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ ర్యాడికల్ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వీటిని మార్చడం లేదు. అయితే, వాటి అమలు కొంత మందగించినా ఆగిపోలేదు.
2000లో అరబ్ రాజ్యాల్లో పెద్దదైన ఈజిప్టు ఇస్లామిక్ చట్టాన్ని సంస్కరిస్తూ ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును మహిళలకు కట్టబెట్టింది. వారికి ఆర్థికపరమైన హక్కులనూ కల్పించింది. పెళ్లికి వయసును ఆడవారికి, మగవారికి 15 ఏళ్లకు పెంచింది. కొందరు ఈ మార్పులను షరియా ఉల్లంఘనలుగా పేర్కొంటూ పురుషులను పణంగా పెట్టి మహిళలకు సాధికారత ఇస్తున్నారనే విమర్శలూ చేస్తున్నారు.
ట్యునీషియా ఒక ముస్లిం దేశమైనపప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్న దేశం 1965లోనే బహుభార్యత్వాన్ని నిర్మూలిస్తూ పర్సనల్ కోడ్ తెచ్చింది. విడాకుల కోసం భార్య, భర్త ఇద్దరూ కోర్టులను సంప్రదించే అవకాశాలు కల్పించింది. వారసత్వ హక్కుల్లోనూ పురుషులకు సమానంగా మహిళలకు హక్కులు ఇచ్చింది. బాల్య వివాహాలు, మహిళల జెనిటల్ మ్యుటిలేషన్‌లను పూర్తిగా నిషేధించింది. ఈ సంస్కరణల కారణంగానే పురోగామిగా అభినందనలు అందుకుంటూనే ఇస్లాంను దాటి పోలేదనే సమర్థింపులనూ స్వీకరిస్తున్నది. అయితే, కొన్ని ఇస్లామిస్టు గ్రూపులు మాత్రం ఈ మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని చట్టాలకు షరియానే ఆధారంగా ఉండాలని వాదిస్తున్నారు. ఈ వ్యతిరేకత ఉన్నప్పటికీ ట్యునీషియా మాత్రం సంస్కరణల పథం వదలడం లేదు.
షరియా ఒక మార్పుకు గురికాకుండా యూనిఫామ్‌గా ఉండేదేమీ కాదు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇస్లాం దేశాల్లోని ముస్లింలు స్థిరంగా మార్పు చేర్పులు చేసుకుంటూ తమ చట్టాలను సంస్కరించు కుంటూ వాటిని వైవిధ్య, మార్పునకు లోబడేవిగా రూపొందించుకుంటున్నారు. ఈ ప్రక్రియలకు చారిత్రక, రాజకీయ, సామాజిక, మత పరమైన సందర్భాలు దోహదం చేస్తున్నాయి. ఆధునిక చట్టాలకూ షరియాను అనువర్తిస్తున్నారు. కానీ, ఆ మార్పులు ప్రయోజనకరంగా ఉండేలా చూసుకుంటున్నారు. కాబట్టి, భారత ముస్లింలు కూడా షరియా అనేది ఒక ద్రావకం వంటి దనే ఆలోచన ను అంగీకరించాలి. ఇతర ముస్లిం దేశా ల్లాగే ముస్లిం సత్య శోధక్ మండల్, భారతీయ మహిళా ఆందోళన్ వంటి ఉద్యమాలను తయారు చేసుకోవాలి, ఉన్నవాటిని బలపరు చుకోవాలి. తద్వార శతాబ్దాల తరబడి సుప్తావస్త లో ఉన్న ముస్లిం పర్సనల్ చట్టాలను సంస్కరించుకోవాలి.
--- వ్యాసకర్త సమీర్ షేక్
