ఢిల్లీ మాజీ డిప్యూటీ సీం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన దాదాపు వారం రోజుల తర్వాత 8 ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రధాని నరేంద్ర మోదీకి ఉమ్మడి లేఖ రాశారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో ఆరోపించారు.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన దాదాపు వారం రోజుల తర్వాత 8 ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రధాని నరేంద్ర మోదీకి ఉమ్మడి లేఖ రాశారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో ఆరోపించారు. ఈ లేఖ రాసినవారిలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు. అయితే ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేలు భాగం పంచుకోలేదు. దీంతో విపక్ష పార్టీలలో ఐక్యత లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ లేఖలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీస్ సిసోడియా అరెస్టును రాజకీయ కుట్రలో భాగమని విపక్ష నేతలు ఆరోపించారు. ‘‘సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. రాజకీయ కుట్రలో భాగమే. ఆయన అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ఢిల్లీ పాఠశాల విద్యను మార్చినందుకు మనీష్ సిసోడియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అతని అరెస్టు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వేటకు ఉదాహరణగా పేర్కొనబడుతుంది. నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశం ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని అనుమానిస్తున్న ప్రపంచం.. దానిని మరింత ధ్రువీకరిస్తుంది’’ అని పేర్కొన్నారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ చార్జీషీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిసోడియా అరెస్ట్‌పై కేంద్రం తీరును విమర్శిస్తూ విపక్ష పార్టీలు ఉమ్మడి లేఖ రాయాలని కేసీఆర్ ప్రతిపాదించారనే సంబంధిత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. సిసోడియాను అరెస్టు చేసిన విషయం ప్రపంచానికి తెలుసునని.. విపక్షాల కూటమి ఏర్పడితే తామే నాయకత్వం వహిస్తామని చెబుతున్న కాంగ్రెస్.. ప్రతిపక్షాలకు చేరువ కావాల్సి ఉందనే అభిప్రాయం ఆ వర్గాల నుంచి వినిపిస్తోంది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ ఉన్నారనే ప్రశ్నను కూడా వారు స్పందిస్తున్నారు.
అయితే ఆ లేఖపై సంతకం చేసేందుకు తమ పార్టీని ఎవరూ సంప్రదించలేదని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ ఉమ్మడి ప్రతిపక్షాన్ని సమర్ధిస్తున్నప్పటికీ.. నిజమైన లౌకిక బీజేపీ వ్యతిరేక పార్టీలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోడియా అరెస్ట్‌పై కాంగ్రెస్ అధికారికంగా నోరు మెదపలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఇటీవల తన సహచరులతో మాట్లాడుతూ.. ఆప్ లిక్కర్ వ్యాపారం నుంచి అక్రమంగా డబ్బు సంపాదించిందని.. గోవా,పంజాబ్ వంటి రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆ డబ్బును ఉపయోగించిందని ఆరోపించినందున దాని పట్ల సానుభూతి ఉండకూడదని అన్నారు.
ఇక, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి లేఖ వెనక కీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా చెబుతున్న కేసీఆర్ కూడా.. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను కలుపుకుపోవడంతో పాటు.. జాతీయ స్థాయిలో సత్తా చాటాలనే ఉద్దేశంలో బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేశారు. అలాగే బీజేపీ వ్యతిరేక జాతీయ ఫ్రంట్‌ను కలిపే ప్రయత్నంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ను మాత్రం కలుపుకుని వెళ్లడానికి కేసీఆర్ సిద్దంగా లేరనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా విపక్ష నేతలు ఉమ్మడిగా రాసిన లేఖలో కూడా కాంగ్రెస్‌కు చోటు దక్కలేదనే వాదన కూడా వినిపిస్తుంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారాలు, ప్రయోజనాల కోసం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటుందని కూడా లేఖలో ఆరోపించారు. ‘‘కేంద్ర ఏజెన్సీలను, గవర్నర్ వంటి రాజ్యాంగ కార్యాలయాలను.. ఎన్నికల రణరంగం వెలుపల ప్రతీకారం తీర్చుకోవడానికి దుర్వినియోగం చేయడం ఖండించదగినది. ఇది మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 2014 నుంచి ఈ ఏజెన్సీలను ఉపయోగిస్తున్న తీరు వారి ప్రతిష్టను దిగజార్చింది. వారి స్వయంప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ ఏజెన్సీలపై భారతదేశ ప్రజల విశ్వాసం సన్నగిల్లుతూనే ఉంది’’ అని లేఖలో ప్రతిపక్షాల నాయకులు పేర్కొన్నారు.
2014 నుంచి బీజేపీ పాలనలో కేంద్ర ఏజెన్సీలు కేసులు నమోదు చేసిన, అరెస్టు చేసిన, దాడులు చేసిన లేదా విచారించిన రాజకీయ నాయకుల్లో అత్యధికంగా ప్రతిపక్షాలకు చెందినవారేనని లేఖలో విపక్ష నాయకులు పేర్కొన్నారు. ‘‘ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీజేపీలో చేరిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులపై ఉన్న కేసులపై దర్యాప్తు సంస్థల విచారణ నెమ్మదిగా ఉంది’’ అని వారు ఆరోపించారు.
ఇక, ప్రధాని మోదీకి రాసిన లేఖపై సంతకాలు చేసినవారిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) నుంచి ఉద్దవ్ ఠాక్రే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు.
