Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్, చంద్రబాబు, జగన్ తహతహ: సాధ్యమేనా?

వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తామని, తాము చెప్పినవారే ప్రధాని మంత్రి అవుతారని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులు అంటున్నారు.

Is it possible to play key role in National politics?

హైదరాబాద్: వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తామని, తాము చెప్పినవారే ప్రధాని మంత్రి అవుతారని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పేది తామేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

తన పార్టీకి 25 మంది లోకసభ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అంటున్నారు. తెలంగాణలోని 16 లోకసభ స్థానాలు తమకు ఇస్తే ఢిల్లీలో పాగా వేస్తానని కేసిఆర్ చెబుతున్నారు.

మొత్తం మీద, ముగ్గురు నాయకులు కూడా దాదాపుగా ఒకే మాట చెబుతున్నారు. పైగా, ఈ ముగ్గురు కూడా కాంగ్రెసును దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది సాధ్యమయ్యే పనేనా అనేది ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్ లో లోకసభ స్థానాలు 25 ఉన్నాయి. ఈ 25 స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో పాటు జనసేన కూడా పోటీ పడుతాయి. ఏకపక్షంగా ఒక పార్టీకి మొత్తం స్థానాలు వస్తాయని చెప్పలేం. తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఉంటే హైదరాబాద్ సీటును మజ్లీస్ కు వదిలేసి 16 స్థానాల్లో గెలుపు తమ పార్టీదేనని కేసిఆర్ చెబుతున్నారు. 

ఆ విషయాన్ని అలా ఉంచితే, జాతీయ రాజకీయాల్లో ఈ ముగ్గురి కన్నా కీలకమైన పాత్ర పోషించే అవకాశం తృణమూల్ కాంగ్రెసుకు, ఎస్పీకి, బిఎస్పీకి ఉన్నాయనే విషయాన్ని వారు మరిచిపోతున్నారు. 

పశ్చిమ బెంగాల్ లో 42 లోకసభ స్థానాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 లోకసభ స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారాన్ని దాదాపుగా ఉత్తరప్రదేశ్ ఫలితాలు ఖరారు చేస్తాయి. తృణమూల్ కాంగ్రెసు అత్యధిక స్థానాలు గెలుచుకుంటే మమతా బెనర్జీ చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుంది. 

ఇకపోతే, బిజెపిని ఎదుర్కోవడానికి బిఎస్పీ, ఎస్పీ ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ రెండింటి పొత్తు తమకు నష్టమేనని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా అంటున్నారు. ఎస్పీ, బిఎస్పీ పొత్తు పెట్టుకుంటే ఉత్తరప్రదేశ్ ఫలితాల తీరు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఆ పార్టీలకు అవకాశం ఉంటుంది.

ప్రధాని పదవి తనకు ఆశ ఉన్నట్లు మాయావతి బహిరంగంగానే చెప్పారు. మమతా బెనర్జీ కూడా ఆ పదవిని ఆశించవచ్చు. ఎన్సీపి నేత శరద్ పవార్ కూడా పోటీకి రావచ్చు. ఎస్పీ నుంచి ములాయం సింగ్ బరిలోకి దిగవచ్చు. దేవెగౌడ ఉండనే ఉన్నారు. కాంగ్రెసుతో కూడి ఈ పార్టీలన్నీ జాతీయ స్థాయిలో పనిచేయాలని అనుకుంటున్నాయి.

ఈ స్థితిలో కెసిఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వీలవుతుందా అనే ప్రశ్న. తాత్కాలికంగా చక్రం తిప్పినా ఎక్కువ కాలం అది కొనసాగుతుందా అనేది కూడా అనుమానమే. కాంగ్రెసును పక్కన పెట్టాలనే తెలుగు రాష్ట్రాల నాయకుల అభిప్రాయం చెల్లుబాటు కాకపోవచ్చు. వైఎస్ జగన్ బిజెపి వైపు వెళ్లినా వెళ్లవచ్చు. ఏమైనా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం తెలుగు రాష్ట్రాల నాయకులకు అంత సులభమేమీ కాదు.

Follow Us:
Download App:
  • android
  • ios