న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ డ్రగ్స్ సంబంధమైన కుట్ర కేసును దర్యాప్తు చేయడంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి సమీర్ వాంఖడే కీలకమైన పాత్ర పోషించారు. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో ఆయన పాత్రపైనే అందరి దృష్టీ పడింది. సమీర్ వాంఖడే నేతృత్వంలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందం సెప్టెంబర్ 6వ తేదీన రియా ఇంటికి చేరుకుంది. ముంబైలోని ఆమె ఇంటికి వెళ్లి సమన్లు జారీ చేసింది.

కేసు దర్యాప్తులో పాత్రపై,  బాలీవుడ్ తో ఉన్న ప్రత్యేక సంబంధాలపై ఆయన పేరు ట్రెండ్ అవుతోంది. నటి క్రాంతి రేడ్కర్ ను ఆయన వివాహం చేసుకున్నారు. క్రాంతి మరాఠీ చిత్రసీమలో ప్రముఖ నటి. అజయ్ దేవగన్ తో కలిసి 2033లో వచ్చిన గంగాజల్ సినిమాలో నటించారు. 

Also Read: ముంబై బైకుల్లా జైలుకు రియా చక్రవర్తి: ప్రత్యేకత ఇదే

సమీర్ వాంఖడే 2017 మార్చిలో క్రాంతి రేడ్కర్ ను వివాహం చేసుకున్నాడు.  క్రాంతి నటి మాత్రమే కాకుండా దర్శకురాలిగా కూడా పనిచేశారు. 2014లో కాకన్ అనే మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించారు. 

సమీర్ వాంఖడే 2008 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ముంబై విమానాశ్రయం కస్టమ్స్ అధికారిగా ఆయన తొలి ఉద్యోగం. సమీర్, ఆయన జట్టు సభ్యులు కలిసి గత రెండేళ్లలో 17 వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.  ఆయన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ డిప్యూటీ కమిషనర్ గా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అదనపు ఎస్పీగా, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జాయింట్ కమిషనర్ గా, ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ గా ఆయన పనిచేశారు.

విదేశీ కరెన్సీతో కొన్న వస్తువుల వివరాలు అందించేంత వరకు, వాటికి పన్ను చెల్లించేవరకు కూడా పలువురు సెలబ్రిటీలకు ఆయన క్లియరెన్స్ ఇవ్వలేదు. పన్నులు చెల్లించనందుకు రెండు వేల మందికి పైగా సెలబ్రిటీలపై ఆయన కేసులు పెట్టారు.

Also Read:అరెస్టు: రాత్రంతా ఎన్సీబీ లాకప్ లోనే రియా చక్రవర్తి.

2013లో విదేశీ కరెన్సీతో వచ్చిన గాయకుడు మికా సింగ్ ను ముంబై విమానాశ్రయంలో సమీర్ పట్టుకున్నారు. అనురాగ్ కశ్యప్, వివేక్ ఒబెరియా, రామ్ గోపాల్ వర్మ వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన ఆస్తులను ఆయన సోదా చేశారు. బంగారంతో చేసిన క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని కూడా కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన తర్వాతనే తీసుకుని వెళ్లడానికి ఆయన అనుమతి ఇచ్చారు.