కశ్మీర్‌కు గవర్నర్ సలహాదారు.. ఎవరీ ఐపీఎస్..? 

కశ్మీర్‌ లోయలో నానాటికి దిగజారిపోతున్న శాంతిభద్రతలను పరీరక్షించేందుకు.. ఉగ్రమూకల ఆటకట్టించేందుకు ఓ చండశాసనుడిని కేంద్రం అక్కడికి పంపుతోంది.. గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టిన మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్‌ను గవర్నర్ సలహాదారుగా పంపింది. ఆయనకు ప్రత్యేకమైన విధులు, బాధ్యతలు అప్పగించింది..

1975 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్‌‌కు విజయవంతమైన ట్రాక్ రికార్డు ఉంది.. అప్పట్టో వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఆయన తన బృందంతో కలిసి నిద్రాహారాలు సైతం మాని.. అడవుల్లో తిరిగారు.. ఆ సమయంలో తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో మురికినీటినే తాగి.. వీరప్పన్‌ను అంతం చేశారు.. అప్పటి వరకు జుట్టు తీయకుండా.. ఆ కరుడుగట్టిన స్మగ్లర్‌ను ఎన్‌కౌంటర్ చేశాకే దేవుడికి తలనీలాలు సమర్పించారు.

చెన్నై పోలీస్ కమీషనర్‌గా పనిచేసిన సమయంలో.. ఎంతోమంది నేరస్థులను ఎన్‌కౌంటర్ చేశారు. సీఆర్‌పీఎఫ్ డిజీగా ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు వేగంగా ప్రయాణించడానికి వీలుగా రహదారులను నిర్మించారు.. దీని ఫలితంగా మావోల ఏరివేత సులభ సాధ్యమైంది. గతంలో బీఎస్ఎఫ్‌కు కశ్మీర్‌లో ఐజీగా పనిచేశారు.. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే కొండంత విశ్వాసంతో కేంద్రం ఆయన్ను కశ్మీర్ లోయకు పంపుతోంది.