ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ : యాపిల్ నుంచి కాకుండా ఎన్జీవో నుంచి మెసేజ్ లు !.. ఏం జరుగుతోంది??
యాపిల్ ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ లో ఓ ఎన్జీవోకు చెందిన యాక్సెస్ నౌ అనే పేజ్ నుంచి వస్తున్నాయి. యాపిల్ సంస్థ నుంచి కాకుండా బైటి నుంచి మెసేజ్ లు రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
న్యూఢిల్లీ : మిగతా ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఫోన్ వాడకం కత్తిమీద సామే. ఏది పడితే అది డౌన్ లోడ్ చేయలేం... కొన్ని యాప్స్ ను అస్సలు ఆ ఫోన్ లో వాడలేం. దీనికి కారణం భద్రతాపరమైనవేనని ఆ సంస్థ చెబుతోంది. దీంతో చాలామంది ప్రముఖులు యాపిల్ ఫోన్లను వాడుతుంటారు. అయితే ప్రస్తుతం యాపిల్ ఫోన్ యూజర్లకు వస్తున్న అలర్ట్ మెసేజ్ లు కలకలం సృష్టిస్తున్నాయి. డేటా సేఫ్టీ. యాపిల్ ఫోన్‌ను నుంచి డేటా చౌర్యం సాధ్యం కాదని, హ్యాక్ చేయడం దుస్సాధ్యం అని ఆ కంపెనీ చెబుతోంది. అయితే.. యాపిల్ బ్రాండ్ వ్యాల్యూకు కీలకాంశం అయిన ఇది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ అలర్ట్ మెసేజ్ లు కూడా యాపిల్ కంపెనీ నుంచి కాకుండా.. http://accessnow.org అనే సోరోస్-లింక్డ్ ఎన్జీవో నుండి వస్తున్నాయి. దీనిమీదే అందరికీ అనుమానాలు తల్లెత్తుతున్నాయి. దీనికి సంబంధించి.. ‘నిజంగా చాలా ఆసక్తిగా ఉంది. కొంతమంది ప్రముఖ యాపిల్ వినియోగదారులకు భద్రతా బెదిరింపు సందేశాలు యాపిల్ సంస్థ నుండి కాకుండా http://accessnow.org అనే సోరోస్-లింక్డ్ ఎన్జీవో నుంచి వస్తున్నాయి. సంస్థకు సంబంధంలేని బయటి ఏజెన్సీ అటువంటి ప్రామాణికమైన సందేశాలను ఎలా పంపగలదు??’ అని సంజీవ్ సన్యాల్ అనే ఓ ఎకనామిస్ట్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. యాక్సెస్ నౌ.ఆర్గ్ లింక్ ను కూడా షేర్ చేశారు.
ఐటీ మంత్రి ఐఫోన్ కూ హ్యాక్ అలర్ట్... అసలేం జరుగుతోంది?
ఇదిలా ఉండగా, ఈ అలర్ట్ మెసేజ్ లతో భారత రాజకీయాల్లో కలకలం రేగింది. ఇప్పటికే తమ ఐఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు యాపిల్ సంస్థ నుండి అలర్ట్ మెసేజ్ లు వచ్చినట్లు వివిధ పార్టీల నాయకులు ఆరోపించగా.. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనకు కూడా ఈ అలర్ట్ మెసేజ్ వచ్చినట్టుగా తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా ఇలాగే అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లకు కూడా యాపిల్ అలర్ట్ మెసేజ్ పంపింది. అయితే, ప్రతిపక్ష నాయకుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వమే నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఐఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. బిజెపి ప్రయోజనాల కోసమే ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు తమ ఐఫోన్లను రిమోట్గా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా, కాంగ్రెస్ కు చెందిన శశి థరూర్, పవన్ ఖేరా థ్రెట్ అలెర్ట్ నోటిఫికేషన్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తమ ఎక్స్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కూడా ఇలాంటి సందేశమే వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.