ఐటీ మంత్రి ఐఫోన్ కూ హ్యాక్ అలర్ట్... అసలేం జరుగుతోంది?
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతల ఐపోన్లకు హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇలా తనకు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ : తమ ఐఫోన్లు హ్యాకింగ్ కు గురయ్యాయనే ప్రతిపక్ష నేతల అనుమానాలతో ఒక్కసారిగా భారత రాజకీయాల్లో కలకలం రేగింది. ఇప్పటికే తమ ఐఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు యాపిల్ సంస్థ నుండి అలర్ట్ మెసేజ్ లు వచ్చినట్లు వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. ఇలా తనకు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తాను వాడే ఐపోన్ ను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా యాపిల్ సంస్థ అలర్ట్ మెసేజ్ పంపినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని పనిచేసే హ్యాకర్లు తన ఐఫోన్ ను టార్గెట్ చేసినట్లుగా యాపిల్ సందేశం పంపినట్లు తెలిపారు. అయితే ప్రతిపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ తనకేమీ కొత్తగా అనిపించడం లేదని... ఎందుకంటే బిజెపి ఎంతకైనా దిగజారుతుందని అందరికీ తెలుసంటూ మండిపడ్డారు. ఇలా తనకు యాపిల్ సంస్థ పంపిన అలర్ట్ మెసేజ్ ను మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేసారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా ఇలాగే అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. అతడు వాడుతున్న యాపిల్ ఫోన్ ను కూడా హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట... ఈ మేరకు యాపిల్ సంస్థ రేవంత్ ఐఫోన్ కు అలర్ట్ మేసేజ్ పంపింది.
Read More యాపిల్ ఫోన్ సేఫా? కాదా?: హ్యాకింగ్ వాదనలపై కేంద్రమంత్రి స్పందన
ఇలా ఇప్పటికే దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లకు కూడా యాపిల్ అలర్ట్ మెసేజ్ పంపింది. ఇలా ప్రతిపక్ష నాయకుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వమే నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఐఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. బిజెపి ప్రయోజనాల కోసమే ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు తమ ఐఫోన్లను రిమోట్గా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా, కాంగ్రెస్ కు చెందిన శశి థరూర్, పవన్ ఖేరా థ్రెట్ అలెర్ట్ నోటిఫికేషన్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తమ ఎక్స్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కూడా ఇలాంటి సందేశమే వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. ఈ అలర్ట్ కేవలం భారత దేశంలోనే కాదు 150 దేశాల్లో ఐఫోన్ వాడుతున్న వారికి కూడా వెళ్లినట్లు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.