అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ విస్తృతంగా జరిగిన నేపథ్యంలో భాగస్వాములతో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రెండు సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ విమాన సేవలను మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ విమాన సేవలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ విస్తృతంగా జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ నెల 27వ తేదీ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ సర్వీస్‌లను రీస్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అంటే ఈ ఏడాది సమ్మర్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని వివరించింది. ఈ అంత సేవలు కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్‌లైన్స్‌కు లోబడే జరుగుతాయని తెలిపింది.

అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్‌ (Scheduled Flights)పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం గతనెల 28వ తేదీన పొడిగించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు అంతర్జాతీయ విమానాల (International Flights)పై నిషేధం (Ban) అమల్లోనే ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అప్పుడు స్పష్టం చేసింది. అయితే, ఈ నిషేధం కార్గో విమానాలకు, ప్రత్యేకంగా అనుమతులు పొందిన ఫ్లైట్స్‌కు వర్తించవని వివరించింది. 

Scroll to load tweet…

అలాగే, ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని కలిగి ఉన్న దేశాలతో భారత్ నుంచి విమాన సేవలు కొనసాగుతాయని వివరించింది. కరోనా ఉధృతి కొంత తగ్గుతున్న సమయంలో కొన్ని దేశాలు పరస్పరం ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం కింద పరస్పర దేశాల మధ్య విమానాలు వస్తూ పోతున్నాయి. 2020 జులై నుంచి ఈ ఒప్పందం కింద భారత్ నుంచి పలు దేశాలకు విమాన రాకపోకలు జరుగుతున్నాయి. భారత్ నుంచి సుమారు 40 దేశాల మధ్య ప్రత్యేక విమానాలు ఈ ఒప్పందం కింద సేవలు అందిస్తున్నాయి. వీటికి తోడు వందే భారత్ మిషన్ కింద నడిచే విమానాలకూ ఈ నిషేధం వర్తించదని డీజీసీఏ పేర్కొంది.

Scroll to load tweet…

2020 మార్చి 23వ తేదీ నుంచి ఈ నిషేధం కొనసాగుతూనే ఉన్నది. సెకండ్ వేవ్ ముగిశాక.. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఎత్తివేస్తామని నవంబర్ 26న కేంద్రం తెలిపింది. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఒక్కసారిగా విజృంభించడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరగ్గానే నిషేధం ఎత్తేయాలన్న నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖను పీఎం మోడీ ఆదేశించారు. దీంతో నవంబర్ 26 ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు డిసెంబర్ 1వ తేదీన డీజీసీఏ వెల్లడించింది.