డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కాస్త ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి పంపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు (శుక్రవారం) తీర్పు వెలువరించింది. ఈ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా... న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ కేసులో జూన్ 20వ తేదీన ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో ట్రాయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు జూన్ 25న స్టే విధించింది.