భారత నౌకాదళానికి మరో కీలక శక్తి రాబోతోంది. రక్షణ పరిశోధన సంస్థ DRDO అభివృద్ధి చేసిన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) సిస్టమ్ ను 2026 జూలైలో INS ఖందేరి సబ్‌మెరైన్‌పై అమర్చనున్నారు. దీని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
INS ఖల్వరీ తర్వాత నౌకాదళంలో చేరిన రెండో కల్వరీ-క్లాస్ సబ్‌మెరైన్ INS ఖందేరిపై ఈ AIP వ్యవస్థను అమర్చనున్నారు. అసలు ఇది మొదటి సబ్‌మెరైన్ ఖల్వరీకే ఉద్దేశించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది. కాబట్టి ఇప్పుడు 2026 మధ్యలో ఖందేరి రిఫిట్ సమయంలో అమర్చనున్నారు.
DRDO–L&T–థర్మాక్స్ భాగస్వామ్యం
ఈ ఆధునిక సిస్టమ్‌ను DRDO, లార్సెన్ & టుబ్రో (L&T), థర్మాక్స్ కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ప్రోటోటైప్ 2025 డిసెంబరులో సిద్ధం కానుంది. దాన్ని సబ్‌మెరైన్‌లో అమర్చేందుకు సుమారు ఒక సంవత్సరం పడుతుంది. తర్వాత హార్బర్ ట్రయల్స్, సముద్ర పరీక్షలు జరపనున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి-ఏప్రిల్ మధ్యలో ట్రయల్స్ ప్రారంభమవుతాయి. 2027 జూలైలో పూర్తి రిఫిట్ ముగుస్తుందని అంచనా.
AIP సిస్టమ్ ప్రత్యేకతలు
ఈ సిస్టమ్ వల్ల డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్‌లు నీటి మీదికి రాకుండా రెండు వారాల వరకు నీటిలోనే ఉండగలవు.
ఫ్యూయల్ సెల్ ఆధారిత AIP ప్రత్యేకత ఏమిటంటే, ఇందులోని హైడ్రోజన్ సబ్‌మెరైన్‌లోనే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి హైడ్రోజన్ వేరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, భద్రతా సమస్యలు తగ్గుతాయి. ఈ టెక్నాలజీ పర్యావరణానికి అనుకూలం, ఎందుకంటే దీని నుంచి వచ్చే ఏకైక వ్యర్థ పదార్థం స్వచ్ఛమైన నీరు మాత్రమే. సాధారణంగా సబ్‌మెరైన్ ప్రతి 4–5 రోజులకు నీటి మీదికి వచ్చి బ్యాటరీలు రీచార్జ్ చేసుకోవాలి. కానీ AIP ఉంటే చాలా కాలం నీటిలోనే ఉండగలదు.
అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానం
AIP వ్యవస్థ కలిగిన సబ్‌మెరైన్‌లను అభివృద్ధి చేసిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరబోతోంది. ఇది ఒక పెద్ద వ్యూహాత్మక మైలురాయిగా పరిగణిస్తారు. ఇటీవల ఫ్రెంచ్ నావల్ గ్రూప్, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ (MDL) కలిసి DRDO AIP సిస్టమ్‌ను సబ్‌మెరైన్‌ల్‌లో అమర్చేందుకు సహకరించనున్నట్లు ప్రకటించాయి.
జంబోసైజేషన్ ప్రక్రియ
AIP అమర్చే సమయంలో సబ్‌మెరైన్ హల్ (బాడీ)ని జాగ్రత్తగా కత్తిరించి, ఇండిజినస్ ఎనర్జీ సిస్టమ్ ప్లగ్ (AIP భాగం)ను అమర్చి మళ్లీ కలిపే ప్రక్రియను జంబోసైజేషన్ అంటారు. ఇది చాలా క్లిష్టమైన కానీ అవసరమైన ప్రక్రియ. 2024 డిసెంబరులో, భారత రక్షణ మంత్రిత్వశాఖ రూ.1,990 కోట్లు విలువైన ఒప్పందాన్ని MDLతో కుదుర్చుకుంది. దీని కింద AIP సిస్టమ్ తయారీ, సబ్‌మెరైన్‌లలో సమీకరణ జరుగుతుంది.
