టీసీఎస్‌లో 30 వేల మందిని తొలగిస్తున్నారా.? అసలేం జరుగుతోంది.
ఇటీవల ఉద్యోగాల తొలగింపునకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలు సైతం వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో దీశీయ టెక్ కంపెనీ టీసీఎస్‌కు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

ప్రమాదంలో 30 వేల ఉద్యోగాలు.?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యూనియన్ ఆఫ్ ఐటీ & ఐటీఈఎస్ ఎంప్లాయీస్ (UNITE) తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, కంపెనీ మాత్రం తన నిర్ణయంపై స్పష్టతనిచ్చింది. లేఆఫ్‌ల వల్ల దాదాపు 30 వేల మందిపై ప్రభావం చూపుతుందని యూనియన్ ఆరోపిస్తుంటే, టీసీఎస్ మాత్రం ఈ సంఖ్యను ఖండిస్తోంది.
చెన్నైలో యూనియన్ ఆందోళనలు
చెన్నైలో మంగళవారం యునైట్ ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని టీసీఎస్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు, మేనేజర్ స్థాయిలో ఉన్నవారిని తొలగించడం అన్యాయం అని, ఈ చర్య వల్ల వేలాది మంది కుటుంబాలు ఇబ్బందులు పడతాయని వారు వాదిస్తున్నారు.
అనుభవజ్ఞులకు బదులుగా ఫ్రెషర్ల నియామకం
యూనియన్ ఆరోపణల ప్రకారం, అనుభవజ్ఞులైన సిబ్బందిని తొలగించి, కొత్తగా ఫ్రెషర్లను తీసుకుంటూ తక్కువ జీతాలతో పనిచేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనుభవం ఉన్న వారికి ఇచ్చే జీతాలతో పోల్చితే 80-85 శాతం తక్కువ వేతనంతో కొత్తవారిని నియమించుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు.
లాభాలున్నా ఎందుకిలా.?
టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.55 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదించింది. ఈ స్థాయిలో లాభాలు నమోదు చేసిన కంపెనీ ఉద్యోగులపై లేఆఫ్‌ల రూపంలో భారాన్ని మోపడం సరైన పద్ధతి కాదని వాదిస్తున్నారు. లాభాలను పెంచుకునే క్రమంలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించడం అన్యాయం అని యూనియన్ స్పష్టం చేసింది.
స్పందించిన టీసీఎస్
యూనియన్ ఆరోపణలపై టీసీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. "30 వేల మందిని తొలగిస్తున్నారన్న వార్తలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. మేము మొత్తం వర్క్ ఫోర్స్‌లో కేవలం 2 శాతం వరకు మాత్రమే తగ్గిస్తున్నాం. అంటే సుమారు 12 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది" అని స్పష్టం చేసింది. కంపెనీ స్పష్టీకరణతో ఉద్యోగుల సంఖ్యపై ఉన్న గందరగోళం తగ్గినా, యూనియన్ ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.