పలు కంపెనీలు తమకు నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నా స్థానిక అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. కరెన్సీ నోట్లు విసిరేస్తూ నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్రలోని హింగోలిలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. ఓ పురుగుమందు కంపెనీ, మరికొన్ని సంస్థలు నకిలీ మందులు అమ్ముతున్నాయని ఆరోపిస్తూ రైతులు కరెన్సీ నోట్లు విసిరేస్తూ తమ ఆందోళనను వ్యక్తపరిచారు. స్వాభిమాని కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం రైతులు ఈ కొత్త రకమైన నిరసనకు తెరతీశారు. వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్, వ్యవసాయ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హింగోలిలోని స్థానిక అథారిటీ కార్యాలయం ఎదుట ఈ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. పురుగు మందుల కంపెనీతో పాటు మరో ఏడుకు పైగా సంస్థలు రైతులకు నకిలీ మందులు విక్రయించాయని ఆరోపించారు.
దీనిపై రైతులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయామని, అందుకే ఇలాంటి నిరసన చేపట్టామని పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
