కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొందరు ఈ పథకాన్ని సమర్థిస్తుంటే, మరి కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. యూపీ సీఎంతో పాటు పలు బీజేపీ పాలిత ప్రాంతాలు అగ్నిపథ్ ను స్వాగతించాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై ఇప్పటికే విమర్శలు చేయగా తాజాగా ఆ జాబితాలో బీఎస్పీ చేరింది.

స్వల్పకాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన సైనికులను రిక్రూట్ చేసుకునేందుకు ఉద్దేశించిన పథకం ‘అగ్నిపథ్’ వల్ల గ్రామీణ యువతకు అన్యాయం జరుగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని సూచించారు. ఈ మేర‌కు ఆమె గురవారం వరుస ట్వీట్ లు చేశారు. 

‘‘ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌ను చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచిన కేంద్రం ఇప్పుడు నాలుగేళ్ల స్వల్ప వ్యవధితో కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్ ‘అగ్నివీర్’ను ప్రకటించింది. దీనిని ఆకర్షణీయమైన పథకం అని కేంద్రం పిలిచినప్పటికీ, దేశంలోని యువత అసంతృప్తి, కోపంతో ఉన్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానంలో మార్పును వారు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు ’’ అని మాయావ‌తి హిందీలో ట్వీట్ చేశారు. “సైన్యం, ప్రభుత్వ ఉద్యోగాలలో పెన్షన్ ప్రయోజనాలను తొలగించడానికి ప్రభుత్వం సైనికుల పదవీకాలాన్ని నాలుగు సంవత్సరాలకు పరిమితం చేస్తుందని యువత విశ్వసిస్తోంది. ఇది చాలా అన్యాయం, హానికరం. గ్రామీణ యువత, వారి కుటుంబాల భవిష్యత్తుకు ఇబ్బంది’’ అని పేర్కొన్నారు. 

డబ్బులే డబ్బులు.. ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే ఐదు రెట్లు ఎక్కువ నగదు.. బారులు తీరిన స్థానికులు

ఇప్పటికే ద్రవ్యోల్బణం, పేదరికంతో బాధపడుతున్న ప్రజల కష్టాలను కొత్త రిక్రూట్‌మెంట్ పథకం మరింత పొడగిస్తుందని మాయావతి విమర్శించారు. ‘‘ దేశంలో ఇప్పటికే పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తప్పుడు విధానాలు, ప్రభుత్వ దురహంకారపూరిత పని తీరుతో ప్రజలు బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సైన్యంలో కొత్త రిక్రూట్‌మెంట్ సిస్టమ్‌పై యువతలో అశాంతి వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది ’’ అని మాయావతి అన్నారు. ఈ అగ్నిప‌థ్ ప‌థ‌కంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే పునరాలోచించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోంద‌ని మాయ‌వ‌తి తెలిపారు. 

Presidential poll 2022: రాష్ట్రప‌తి ఎన్నిక‌లు.. ఇప్ప‌టివ‌ర‌కు 11 నామినేష‌న్ల దాఖ‌లు.. ఎవ‌రేవ‌రంటే..?

కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట అగ్నిప‌థ్ ప‌థ‌కం ప్రారంభించింది. ఇండియ‌న్ ఆర్మీ, ఇండియ‌న్ నేవీ, ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ల ఆధ్వ‌ర్యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప‌థ‌కాన్ని లాంచ్ చేశారు. ఈ ప‌థ‌కం కింద మూడు ద‌ళాల్లో నాలుగేళ్ల పాటు యువ‌త‌ను రిక్రూట్ చేసుకుంటారు. ఇందులో రిక్రూట్ అయిన అభ్య‌ర్థుల‌ను అగ్నివీర్స్ అని పిలుస్తారు. ఇలా నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవ‌లందించిన అగ్నీవ‌ర్స్ లో 25 శాతం మందిని రెగ్యులర్ గా తీసుకుంటారు. మిగిలిన 75 శాతం అగ్నివీర్ లను పాక్యేజీ ఇచ్చి పంపించేస్తారు. అయితే వీరు ఇంటికి వ‌చ్చిన త‌రువాత వివిధ సంస్థ‌లు రిక్రూట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తాయి. 

ఈ అగ్నిప‌థ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మ‌హిళ‌లు, పురుషుల‌ను ఇద్ద‌రినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోనుంది. 

Agnipath : పోలీస్ రిక్రూట్ మెంట్స్ లో ‘అగ్నివీర్స్’ కు ప్రియారిటీ - యూపీ సీఎం యోగి

ఈ ప‌థ‌కంపై భిన్న ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప‌థ‌కాన్ని విమ‌ర్శించింది. పరివర్తనాత్మక అగ్నిపథ్ పథకం సాయుధ దళాల కార్యాచరణ ప్రభావాన్ని తగ్గిస్తుందని కాంగ్రెస్ హెచ్చరించింది. సైనికుల భవిష్యత్తుపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు దీనిని స్వాగ‌తిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పోలీసు, దాని అనుబంధ రంగాల్లో అగ్నివీర్స్ కు ప్రాధాన్య‌త ఇస్తామ‌ని తెలిపారు. అలాగే సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో ఈ పథకం కింద నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.