కరోనా కష్టకాలంలో రక్తసంబంధీకులు, ఆత్మీయులు, బంధువులు సైతం ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ సోకిందన్న విషయం తెలిస్తే చాలు ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. ఇక అంత్యక్రియల సంగతి సరేసరి. కరోనాతో మృతి చెందిన వారికి సొంత కుటుంబీకులే  అంత్యక్రియలు నిర్వహించని పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది.

కన్న తల్లిదండ్రుల శవాలను వదిలి పెడుతున్న కొడుకులు, కూతుళ్లు ఎందరో కనిపిస్తున్నారు. చాలా చోట్ల కోవిడ్‌తో మృతి చెందిన వారి మృతదేహాలను ఆసుపత్రిలోనే వదిలి వెళ్తున్న పరిస్థితి. అలాంటి వారికి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు , కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Also Read:అధ్యయనం: కోవిడ్‌తో మరణించిన వారి శరీరంలో వైరస్ ఎంతసేపు వుంటుంది..?

అలాంటిది తన కన్నతల్లి మరణవార్త తెలిసినా డ్యూటీ పూర్తి చేశాకే ఇంటికి వెళ్లాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. ఓ వైపు తల్లి మరణించిందన్న బాధను దిగమింగుకుని అత్యవసర పరిస్థితుల్లో వున్న 15 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రికి చేర్చాడు. 

వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన ప్రభాత్ యాదవ్ గత తొమ్మిదేళ్లుగా ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన నైట్ డ్యూటీలో ఉండగా తల్లి చనిపోయినట్టు అతనికి సమాచారం వచ్చింది. అప్పటికి అతను తన డ్యూటీ షిఫ్ట్ మధ్యలో ఉన్నాడు. కోవిడ్ రోగుల నుంచి వరుసపెట్టి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

లోపల నుంచి కన్నీళ్లు వస్తున్నా పంటి బిగువున పెట్టి ఆ రాత్రంతా డ్యూటీ చేసి 15 మంది కరోనా రోగులను హాస్పిటల్‌కు చేర్చాడు. అనంతరం 200 కి.మి. దూరంలో ఉన్న గ్రామానికి బయల్దేరాడు. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసి 24 గంటల్లో వెనక్కి తిరిగి వెళ్లి విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాత్ యాదవ్‌ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.