Asianet News TeluguAsianet News Telugu

అధ్యయనం: కోవిడ్‌తో మరణించిన వారి శరీరంలో వైరస్ ఎంతసేపు వుంటుంది..?

కరోనా వైరస్ ఈ భూమ్మీద అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో అపోహలు, అనుమానాలు. వీటిలో కొన్నింటికి వైద్య ప్రపంచం సమాధానాలు చెప్పగలిగింది. కొన్నింటికి సమాధానాన్ని అన్వేషిస్తోంది. ఇకపోతే సామాన్య జనాన్ని తీవ్రంగా వేధిస్తున్న అనుమానం.... కరోనాతో మరణించిన మృతదేహంలో వైరస్ ఎంత సేపు వుంటుందనే. 

covid does not remain active in nasal oral activities after death ksp
Author
New Delhi, First Published May 25, 2021, 8:45 PM IST

కోవిడ్ భయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు, భార్యా, భర్త, కొడుకులు, కూతుళ్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ ఫొరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్తా క్లారిటీ ఇచ్చారు. కరోనాతో బాధపడుతూ చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12-24 గంటల తర్వాత వైరస్‌ బతకలేదని వెల్లడించారు. ఈ విషయమై ఏడాది కాలంగా ఎయిమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ అధ్యయనం చేస్తోందని ఆయన వివరించారు. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన మెడికో-లీగల్‌ కేసులను పరీక్షించడం ద్వారా ఈ విషయాలను గుర్తించినట్లు సుధీర్ తెలిపారు.  

ఈ సందర్భంగా కరోనా బారిన పడి చనిపోయిన 100కు మృతదేహాలను తాము పరీక్షించామని.. ఈ సందర్భంగా శవాలకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు. మృతదేహాల నుంచి వైరస్‌ వ్యాప్తి జరగడానికి అవకాశం చాలా తక్కువని సుధీర్ చెప్పారు. అయితే, ముందస్తు రక్షణలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలు, శరీరం నుంచి ద్రవాలు స్రవించే ప్రదేశాలను మూసి వేయడంతో పాటు, రోగికి అమర్చిన వివిధ పైపులను శానిటైజ్‌ చేయాలి అని వైద్యులకు సూచించారు.  

Also Read:బ్లాక్ ఫంగస్ భారత్ కే పరిమితమా? ఎందుకలా...

అలాగే అంత్యక్రియల్లో పాల్గొనే వారు సైతం ముందస్తు రక్షణగా కచ్చితంగా మాస్క్‌లు, చేతికి గ్లౌవ్స్‌, పీపీఈ కిట్లు ధరించాలని సూచించారు.  అంత్యక్రియలు ముగిసిన అనంతరం చితాభస్మం సేకరించడం పూర్తిగా సురక్షితమేనని తెలిపారు. ఆ సమయంలో కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదని... చనిపోయిన వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ అధ్యయనం చేశామని సుధీర్ వెల్లడించారు. 

కాగా, మే 2020లో కొవిడ్‌-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్‌మార్టం చేయడంపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. కోవిడ్ మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్టం వల్ల మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను ప్రమాదంలో పడేసినట్లు అవుతుందని ఐసీఎంఆర్ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తే, సరైన రక్షణతో వేగంగా ఆ పని ముగించాలని సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios