ద్రవ్యోల్బణం షాక్: పెరిగిన అమూల్ పాల ధరలు.. బడ్జెట్ ఎఫెక్ట్ అంటూ సర్కారుపై ప్రతిపక్షాల విమర్శలు
New Delhi: అమూల్ పాల ధరలు మళ్లీ పెరిగాయి. పాల ధర లీటరుకు రూ.3 పెంచినట్లు అమూల్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించాయి. కేంద్ర బడ్జెట్ ప్రభావం అప్పుడే సామాన్య ప్రజలపై పడిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాయి.

Amul Milk Prices Hike: కేంద్ర బడ్జెట్ 2023ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వెంటనే దేశ ప్రజలకు పెద్ద దెబ్బ తగిలింది. అమూల్ పాల ధరను పెంచింది. అమూల్ పాల ధరలను లీటరుకు రూ.3 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన పాల ధరలు ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది. ఇకపై అమూల్ తాజా పాలు రూ.27కే లభిస్తాయని కంపెనీ తెలిపింది. 1 లీటర్ ప్యాకెట్ కు రూ.54 చెల్లించాలి. అమూల్ గోల్డ్ అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ ఇకపై అర కిలో ప్యాకెట్ రూ.33కు లభిస్తుంది. అంటే లీటర్ కు రూ.66 చెల్లించాలి. అమూల్ ఆవు లీటర్ పాల ధర రూ.56కు చేరింది. అర లీటర్ కు రూ.28 చెల్లించాలి. గేదె ఏ2 పాలు కిలో రూ.70కి లభిస్తాయి.
ఇదేనా అచ్చే దిన్.. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్
అచ్ఛే దిన్ అంటే ఇదేనా అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. గత ఏడాది కాలంలో అమూల్ పాల ధరను లీటరుకు రూ.8 పెంచిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కేంద్ర బడ్జెట్ ప్రభావం అప్పుడే సామాన్య ప్రజలపై పడిందంటూ ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధించాయి.
ఐకానిక్ అమూల్ బ్రాండ్ ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) అన్ని వేరియంట్లలో పాల ధరలను లీటరుకు రూ.3 పెంచడంతో కాంగ్రెస్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ పెంపు సామాన్యులపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. 'అమూల్ పాల ధర పెంచితే సామాన్యులు నష్టపోతారు. బహుశా మోడీజీ, అమిత్ షాజీ పాలు తాగరు. కానీ మన దేశ పిల్లలు పాలు తాగడం చాలా అవసరం. పాల ధరలను పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఉద్దేశాన్ని స్పష్టం చేసిందన్నారు.
సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరిస్తూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. లీటర్ పాల ధర రూ.3 పెరగడం మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మీ కుటుంబం రోజుకు రెండు లీటర్ల పాలు తాగితే ఇకపై రోజుకు రూ.6 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక కుటుంబానికి నెలకు రూ.180, ఏడాదికి రూ.2,160 అదనంగా చెల్లిస్తారని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
అమూల్ పాల కొత్త రేట్లు ఇలా ఉన్నాయి..
అమూల్ ఫ్రెష్ 500 ml రూ.27
అమూల్ ఫ్రెష్ 1 లీటర్ రూ.54
అమూల్ ఫ్రెష్ 2 లీటర్లు రూ.108
అమూల్ ఫ్రెష్ 6 లీటర్లు రూ.324
అమూల్ ఫ్రెష్ 180 ml రూ.10
అముల్ గోల్డ్ 500 ml రూ.33
అమూల్ గోల్డ్ 1 లీటర్ రూ.66
అముల్ గోల్డ్ 6 లీటర్లు రూ.396
అముల్ ఆవుస్ మిల్క్
285 మిల్క్ 1 లీటర్ రూ.56
అముల్ A2 గేదె పాలు 500 ml రూ.36
అముల్ A2 గేదె పాలు 1 లీటర్ రూ.70
అముల్ A2 గేదె పాలు 6 లీటర్ రూ.420
గతేడాది రెండు రూపాయలు పెరిగింది..
గతేడాది అక్టోబర్‌లో అమూల్ పాల ధరను లీటరుకు రూ.2 పెంచింది. మొత్తం పని ఖర్చులు, పాల ఉత్పత్తి పెరగడం వల్లనే ఈ ధరల పెంపు జరిగిందని చెబుతున్నారు.