పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడిని ఉదయ్‌పూర్‌కు తీసుకెళ్లిన ఇండిగో ఫ్లైట్.. వివరణ ఇవ్వాలని ఆదేశించిన డీజీసీఏ
ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లాల్సిన ప్రయాణికుడిని ఇండిగో విమానం ఉదయ్‌పూర్‌కు తీసుకెళ్లింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ పొరపాటు జరిగింది. పాట్నాకు తీసుకెళ్లే విమానం కాకుండా ఉదయ్‌పూర్‌కు వెళ్లే విమానం ప్రయాణికుడు ఎక్కాడు. సిబ్బంది చెకింగ్‌లోనూ లోపాలు ఉన్నాయి. దీంతో డీజీసీఏ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడిని ఇండిగో విమానం ఉదయ్‌పూర్‌కు తీసుకెళ్లింది. ఈ ఘటన గత నెల 30వ తేదీన చోటుచేసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ పై చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ప్రయాణికుడు అఫ్సర్ హుస్సేన్ ఢిల్లీ నుంచి పాట్నాకు 6ఈ214 విమానంలో వెళ్లాల్సి ఉన్నది. ఢిల్లీ ఎయిర్ పోర్టు టర్మినల్ 1 నుంచి ఆయన బయల్దేరాలి. ‘ఈ ఫ్లైట్ బోర్డింగ్ కోసం ఎరోబ్రిడ్జీ ద్వారా కాకుండా కోచ్‌ల ద్వారా వెళ్లాల్సి ఉన్నది. ఆయన సరైన గేటు వద్దనే ఉన్నాడు. ఆయన కార్డును స్కాన్ చేయించుకున్న తర్వాత టర్మినల్ బిల్డింగ్ నుంచి కోచ్ ఎక్కాడు. అది 6ఈ214 విమానం వద్దకు చేర్చే స్టాండ్ వద్దకు తీసుకెళ్లుతుంది’ అని ఈ ఘటన గురించి తెలిసిన వారు పేర్కొన్నారు. అయితే, అసలు పొరపాటు ఇక్కడే జరిగిందని చెబుతున్నారు.
టర్మినట్ నుంచి బయటకు వస్తూ హుస్సేన్ ఉదయ్‌పూర్‌కు వెళ్లుతున్న 6ఈ319 విమానం వద్దకు చేర్చే కోచ్ ఎక్కాడు. అయితే, ర్యాంప్ వద్ద హుస్సేన్‌ను డిటెక్ట్ చేయవద్దు. కానీ, అది ఫెయిల్ అయింది. అలాగే, హుస్సేన్ కూడా తాను వేరే విమానం ఎక్కుతున్నట్టు గ్రహించలేకపోయాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా అనౌన్స్‌మెంట్లనూ ఆయన పట్టించుకోలేదు. అయితే, పాట్నా వెళ్లే విమానం హుస్సేన్ కోసం వెతికిందా? లేదా? అనేది తెలియదు.
Also Read: ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కవర్ తొలగించే యత్నం.. ప్రయాణికుడిపై కేసు నమోదు..
హుస్సేన్ తాను వేరే విమానంలో ప్రయాణించానని ఉదయ్‌పూర్‌లో దిగిన తర్వాతే తెలుసుకున్నాడు. వెంటనే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేశాడు. ఇండిగో ఎయిర్ లైన్ వెంటనే అతడిని ఢిల్లీకి తీసుకువచ్చింది. అక్కడి నుంచి సాయంత్రానికల్లా పాట్నాకు చేర్చింది.
దీనికి సంబంధించి ఇండిగో ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. తమకు ఈ విషయం తెలిసిందని, ప్రయాణికుడికి కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని పేర్కొంది. దీనికి సంబంధించి దర్యాప్తు చేయడానికి అధికారులను పంపించామని వివరించింది.
చాలా చోట్ల చెకింగ్‌లు ఉంటాయని, అయినప్పటికీ ఇలాంటి తప్పిదం చోటుచేసుకోవడంపై అధికారులు ఆశ్చర్యపోతున్నారు.బోర్డింగ్ కార్డ్స్ స్కాన్ చేసినప్పుడే పొరపాటు తెలిసి రావాలి అని తెలిపారు.