విమానం గాలిలో ఉన్న సమయంలోనే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవసర ద్వారం) కవర్‌ను తొలగించేందుకు యత్నించాడు. దీంతో విమానంలోని సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. 

విమానం గాలిలో ఉన్న సమయంలోనే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవసర ద్వారం) కవర్‌ను తొలగించేందుకు యత్నించాడు. దీంతో విమానంలోని సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. నాగ్‌పూర్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా ఆ ఎయిర్‌లైన్స్ ఆదివారం వెల్లడించింది. విమానం ముంబైలో ల్యాండింగ్ కోసం సమీపిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కవర్‌ను తొలగించడానికి ఒక ప్రయాణికుడు ప్రయత్నించాడని తెలిపింది. ఆరోపించిన చర్యకు సంబంధించి ప్రయాణికుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని పేర్కొంది. భద్రతపై ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపింది. అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఆ వ్యక్తికి సంబంధించిన ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. 

‘‘నాగ్‌పూర్ నుంచి ముంబైకి 6E-5274 ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు విమానం గాలిలో ఉన్నప్పుడు, ల్యాండింగ్ కోసం చేరుకునే సమయంలో అత్యవసర ద్వారం కవర్‌ను తొలగించడానికి ప్రయత్నించాడు. ఈ ఉల్లంఘనను గమనించిన విమానంలో ఉన్న సిబ్బంది కెప్టెన్‌ను అప్రమత్తం చేశారు. ఆ ప్రయాణీకుడికి తగిన విధంగా హెచ్చరించడం జరిగింది. విమానాన్ని సురక్షితంగా నడిపించడంలో ఎలాంటి రాజీ పడలేదు. విమానం ల్యాండింగ్ ప్రక్రియలో ఉన్నందున ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అనధికారికంగా ట్యాంపరింగ్ చేసినందుకు ప్రయాణికుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది’’అని ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ఇక, ఆ వ్యక్తిపై ముంబై విమానాశ్రయం పోలీసు అధికారులు.. ఇతరుల ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు హాని కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 336తో పాటుగా ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం, 1937 కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.