దడపుట్టించాడు.. విమానం ల్యాండింగ్ కు ముందు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయి...
విమానం లాండింగ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడో వ్యక్తి. దీంతో తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

చెన్నై : ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలు అంటేనే భయపడేలాగా జరుగుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్నిసార్లు ప్రయాణికుల ప్రవర్తన, మరికొన్నిసార్లు సిబ్బంది ప్రవర్తన విమాన ప్రయాణాల మీద భయాందోళనలను కలిగిస్తున్నాయి. ప్రయాణికులు విమానాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించడమే కాకుండా సిబ్బందిపై దాడి చేయడం ఘటనలు కూడా జరుగుతున్నాయి.
తాజాగా ఇండిగో విమానంలో ఇలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. ఇండిగోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ తోటి ప్రయాణికులను తన ప్రవర్తనతో హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరిన విమానంలో వెలుగు చూసింది.
విషాదం.. కర్మ పూజ చేసేందుకు మట్టి కోసం చెరువులోకి దిగి నలుగురు బాలికలు మృతి
దీనికి సంబంధించి అధికారులు ఈ మేరకు వివరాలు తెలిపారు.. 6E 6341 ఇండిగో విమానం.. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరింది. విమానం మరికొద్దిసేపట్లో చెన్నైలో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారు. ఆ తర్వాత సురక్షితంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అయింది. వెంటనే ఆ వ్యక్తిని సిఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఎయిర్ లైన్స్ అధికారులు అతడిని అప్పగిస్తూ విమానంలో జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలను సిఐఎస్ఎఫ్ కు తెలిపారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఇండిగో ఎయిర్లైన్స్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసింది. దీని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.