చంద్రయాన్‌-3ను విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల, పరిశోధకుల నిర్విరామ కృషికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

జాబిల్లిపై పరిశోధనల జరిపేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం  విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్‌ ల్యాండర్ దిగింది. చంద్రయాన్‌ -3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. దీంతో చంద్రయాన్‌-3ను విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల, పరిశోధకుల నిర్విరామ కృషికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించే సమయంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు ఫ్లైట్ సిబ్బంది నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇటీవల ఒక ఎయిర్ హోస్టెస్-పూజా షా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోను పోస్టు చేయడంతో పాటు..‘‘మిస్టర్ ఎస్ సోమనాథ్.. ఇస్రో చైర్మన్. మన ఇండిగో ఫ్లైట్‌లో మిస్టర్ ఎస్ సోమనాథ్‌కు సేవ చేసే అవకాశం లభించడం విశేషంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. 

ఆ వీడియోలో ఏముందంటే.. ఎయిర్ హోస్టెస్ మైక్రోఫోన్ ద్వారా ప్రయాణికులకు ప్రకటన చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఎయిర్ హోస్టెస్ తన స్వరంలో ఎనలేని గర్వంతో.. విమానంలో ఉన్న ఎస్ సోమనాథ్‌ని పలకరించారు.  ‘‘ఈరోజు మన ఫ్లైట్‌లో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రయాణిస్తున్నట్టుగా ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. మిస్టర్ సోమనాథ్, ఆయన టీమ్‌కు భారీ చప్పట్లు. భారతదేశం గర్వపడేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు’’అని వీడియోలో ఎయిర్‌ హోస్టెస్ చెప్పడం వినవచ్చు. ఆ కొద్దిసేపటికే.. ఉత్సాహంగా ఉన్న ప్రయాణీకులు చప్పట్లు కొట్టారు. కొంతమంది ముఖాల్లో చిరునవ్వులు కూడా కనిపించాయి.

 

View post on Instagram
 

ఇక, మరో ఎయిర్ హోస్టెస్ ఆహారం, ఇతర పానీయాలతో నిండిన ట్రేతో ఎస్ సోమనాథ్ వద్దకు రావడం కనిపించింది. ఎయిర్ హోస్టెస్ కూడా అతనికి ఒక నోట్‌ను అందజేశారు. దానిని ఆయన చిరునవ్వుతో స్వీకరించారు.