న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్నాయి.  గతంతో పోలిస్తే  కోవిడ్ కేసుల సంఖ్య మూడు లక్షల లోపుగా  కరోనా కేసులు రికార్డు అవుతున్నాయి. గతంలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షలుగా రికార్డయ్యాయి. అయితే కరోనాతో మరణించిన రోగుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తోంది. 

సోమవారం నాడు 18,69,223 మందికి పరీక్షలు నిర్వహిస్తే  2,63,533 మందికి కరోనా సోకింది. గత ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గత 24 గంటల వ్యవధిలో 4329 మంది కరోనాతో మరణించారు. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య ఇదే అత్యధికం.  ఈ నెల 11వ తేదీన కరోనాతో 4,205 మంది మరణించారు. ఆ తర్వాత ఇవే అత్యధిక మరణాలుగా వైద్య ఆరోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. సోమవారం నాడు మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనాతో మరణించారు. ఈ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య వెయ్యిగా నమోదైంది. 

దేశంలో ఇప్పటివరకు 2.52 కోట్ల మందికి కరోనా పాజిటివ్ గా  తేలింది. కరోనాతో ఇప్పటివరకు 2,78,719 చనిపోయారు.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కరోనా నుండి రికవరీ అయ్యే  కేసుల సంఖ్య పెరగడం కొంత ఊరటనిస్తోంది.