Asianet News TeluguAsianet News Telugu

దేశంలో 40 శాతం సంపద ఒక్కశాతం ధనికులది.. సగం జనాభా దగ్గర ఉన్నది 3 శాతం సంపదే: సంచలన నివేదిక

దేశంలో సంపద తక్కువ మంది చేతుల్లోకి వెళ్లుతున్నదని, విశాల ప్రజానీకం పేదరికంలోకి కూరుకుపోతున్నదని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. దేశంలోని 40 శాతం సంపద కేవలం ఒక్క శాతం ధనికుల వద్దనే ఉన్నదని వివరించింది. కాగా, దేశంలోని సగం మంది జనాభా వద్ద కేవలం మూడు శాతం సంపదే ఉన్నదని పేర్కొంది. పన్నులు సంపన్నుల కంటే పేదలే ఎక్కువ కడుతున్నారని, కరోనా మహమ్మారి కాలంలో ధనికుల సంపద కూడా భారీగా పెరిగిందని వివరించింది.
 

indias richest one percent own countrys 40 percent wealth says oxfam report
Author
First Published Jan 16, 2023, 1:59 PM IST

న్యూఢిల్లీ: ప్రతియేటా దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశాలు జరిగే మొదటి రోజున హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్‌లో అసమానతల నివేదికను ప్రచురిస్తూ ఉంటుంది. ఈ రిపోర్టు భారత దేశానికి సంబంధించిన వివరాలనూ వెల్లడించింది. ఇది ఆశ్చర్యకరమైన గణాంకాలను మనముందుకు తీసుకువచ్చింది. దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతున్నదని, ట్రికిల్ డౌన్ (బొట్లు బొట్లుగా సంపద పై నుంచి కింది వర్గాలకు అందడం) అనేది సాధ్యం కావడం లేదని స్పష్టం చేస్తున్నది. అంతేకాదు, కరోనా మహమ్మారి కాలంలోనూ సంపన్నులు ఊహించని రీతిలో సంపాదించుకున్నారని ఈ రిపోర్టు వెల్లడించింది. పన్నులు మాత్రం సంపన్నుల కంటే పేదలే ఎక్కువ కడుతున్నారని పేర్కొంది.

భారత దేశంలో అత్యంత ధనికులైన ఒక్క శాతం మంది దగ్గరే దేశంలోని 40 శాతం సంపద ఉన్నదని ఆక్స్‌ఫామ్ నివేదక చెబుతున్నది. కాగా, దేశంలో సగం జనాభా దగ్గర ఉన్నది కేవలం మూడు శాతం సంపదే అని వెల్లడిస్తున్నది. పది మంది అత్యంతు సంపన్నులపై ఐదు శాతం పన్ను విధించినా దేశంలోని పిల్లలందరినీ బడికి పంపించే సొమ్ము జమ అవుతుందని లెక్క గట్టింది.

సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ అనే టైటిల్‌లో విడుదలైన ఈ నివేదికలో దేశంలోని బిలియనీర్లపై వారి మొత్తం సంపద పై రెండు శాతం పన్ను విధించినా (రూ. 40,423 కోట్లు) పౌష్టికాహార లోపాన్ని లేకుండా తరిమేయవచ్చని తెలిపింది. పది మంది బిలియనీర్లపై ఒక్కసారి ఐదు శాతం పన్ను వేసినా (1.37 లక్షల కోట్లు) అది కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆయుశ్ శాఖల 2022-23 బడ్జెట్ అంచనా వ్యయాలకు 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని వివరించింది.

Also Read: భార‌తీయ లేబ‌ర్ మార్కెట్ లో 99 శాతం మ‌హిళ‌ల‌పై లింగ వివ‌క్ష.. తేల్చి చెప్పిన ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక

కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి గతేడాది నవంబర్ వరకు భారత బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. మరో రకంగా చెప్పాలంటే వారి సంపద రోజుకు రూ. 3,608 చొప్పున పెరిగిందని ఆక్స్‌ఫామ్ చెప్పింది. కాగా, 2021-22 కాలంలో జీఎస్టీ కింద వచ్చిన మొత్తం రూ. 14.83 లక్షల కోట్లలో 64 శాతం దేశంలో దారిద్ర్యంలో జీవిస్తున్న 50 శాతం జనాభా నుంచి వసూలైందని, టాప్ 10 సంపన్నుల నుంచి వచ్చిన జీఎస్టీ కేవలం మూడు శాతమే అని స్పష్టం చేసింది. 2020లో మన దేశంలో 102 మందిగా ఉన్న బిలియనీర్ల సంఖ్య 2022లో 166కు చేరింది.

మన దేశంలోని టాప్ 100 మంది సంపన్నుల సంపద (సుమారు రూ. 54.12 లక్షల కోట్లు) 18 నెలలకు సరిపోయే కేంద్ర బడ్జెట్‌తో సమానంగా ఉంటుందని వివరించింది. 

ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బేహర్ మాట్లాడుతూ, దేశంలోని దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలు, అసంఘటితరంగ కార్మికులు.. సంపన్నుల ఎదుగుదలకే తోడ్పడుతున్న వ్యవస్థలో నలిగిపోతున్నారని అన్నారు. పేదలు అనూహ్యస్థాయిల్లో అధికంగా పన్నులు చెల్లిస్తున్నారని, అత్యవసర సరుకులు, సేవలపై సంపన్నుల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారని తెలిపారు. సంపన్నులపైనా పన్ను విధించే సమయం ఆసన్నమైందని, వెల్త్ టాక్స్, ఇన్‌హెరిటెన్స్ టాక్స్, ప్రొగ్రెస్సివ్ టాక్స్ వంటివి అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios