చెన్నైలో ఓ ఆన్ లైన్ పెళ్లికి మద్రాస్ హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలో అబ్బాయి.. తమిళనాడులో అమ్మాయి వర్చువల్ పద్ధతిలో వివాహం చేసుకోవచ్చని తెలిపింది.
చెన్నై : మద్రాస్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళా వర్చువల్ విధానంలో ఇండో అమెరికన్ ను పెళ్లి చేసుకోవడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. వివాహం చేసుకోవడం మానవ ప్రాథమిక హక్కు అని ప్రత్యేక వివాహ చట్టం 1954లోని సెక్షన్ 12, 13 ఈ హక్కును తెలియజేస్తోందని ఈ సందర్భంగా జస్టిస్ జిఆర్ స్వామినాథన్ తెలియజేశారు. చట్టంలోని సెక్షన్ 12 (2) ప్రకారం ఏ రూపంలోనైనా వివాహం జరుపుకోవచ్చని ఆయన గుర్తు చేశారు. దీంతో పిటిషన్ దారుడు వర్చువల్ విధానాన్ని ఎంచుకున్నారు. వివరాల్లోకి వెడితే…
భారతీయ అమెరికన్ అయిన రాహుల్ ఎల్ మధుతో తన వివాహాన్ని వర్చువల్ విధానం ద్వారా జరిపించేందుకు కన్యాకుమారి సబ్ రిజిస్టర్ ను ఆదేశించాలంటూ వాస్మి సుదర్శిని అనే మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అలాగే తమ వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద రిజిస్టర్ చేసి వివాహ దృవీకరణ పత్రం జారీ చేయాలని ఆమె కోరింది. దీనిని విచారించిన జస్టిస్ స్వామినాథన్ బెంచ్.. ముగ్గురు సాక్షుల సమక్షంలో వర్చువల్ విధానంలో రాహుల్ ఎల్ మధుతో పిటిషనర్ వివాహం నిర్వహించవలసిందిగా సబ్ రిజిస్టార్ ను ఆదేశించింది.
తమిళనాడులో గంజాయి చాక్లెట్ల విక్రయం: ఒకరి అరెస్ట్, మరో 15 మంది కోసం గాలింపు
ఇక వివాహానికి హాజరయ్యే ఇరుపక్షాలు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాల్సిన అవసరం లేదని కూడా న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. కాగా, పిటిషనర్ కమ్ పెళ్లి కూతురు సుదర్శినికి రాహుల్ మధు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ ఉంది. కాబట్టి వివాహం తరువాత సుదర్శినిని మధు తరపున వివాహ ధృవీకరణ పత్రంలో, రిజిస్టర్ ఆఫీస్ లోని రిజిస్టర్ లో సంతకం చేసేందుకు కోర్టు అనుమతించింది. ఆ తర్వాత ఆమెకు చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం వివాహ దృవీకరణ పత్రం జారీ చేస్తారు. కన్యాకుమారికి చెందిన సుదర్శిని, అమెరికాకు చెందిన రాహుల్ మధు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.
అయితే రాహుల్ అమెరికాలో ఉండగా.. సుదర్శిని ఇండియాలో ఉంది. రాహుల్ కు ఇప్పుడిప్పుడే భారత్ కు వచ్చే అవకాశం లేదు. దాంతో ఇరు కుటుంబాల వారు ఇలా కోర్టు అనుమతితో ఆన్లైన్లో వివాహం చేయడానికి రెడీ అయ్యారు.
