తమిళనాడులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 21 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 15 మంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

చెన్నై: స్కూల్ విద్యార్ధులను, చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని గంజాయి చాకెట్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

Tamilnadu రాష్ట్రంలోని రథినపురిలో 58 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 21 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 15 మంది కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పక్కా సమాచారం మేరకు రత్నిపురి పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు సంగనూరు రోడ్డు జంక్షన్ సమీపంలో గల కన్నప్ప నగర్ లో తనిఖీలు నిర్వహించిన సమయంలో అనుమానాస్పదంగా ఉన్న బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాలాజీ వద్ద గంజాయి చాక్లెట్లను పోలీసులు సీజ్ చేశారు. బాలాజీకి సుమారు 15 మంది యువకుల నెట్ వర్క్ ఉన్నట్టుగా పోలీసులు వివరించారు. నిందితుడు రాజస్థాన, బెంగుళూరు నుండి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

సాధారణ చాక్లెట్లు ఉన్నట్టుగానే గంజాయి చాక్లెట్లు కూడా ఉంటాయని డిప్యూటీ కమిషనర్ జీఎస్ మాధవన్ చెప్పారు. దాదాపు ఐదు గ్రాముల చాక్లెట్ ను రూ. 200కి విక్రయిస్తున్నారు.చదువుకునే విద్యార్ధులే లక్ష్యంగా నిందితులు చాక్లెట్లు విక్రయిస్తున్నారు. మొత్తం 16 మందిపై ఐపీసీ, ఎన్‌డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఆర్ఎస్ పురం పోలీసులు రాజస్థాన్ కు చెందిన వ్యక్తి నుండి 40 కిలోల గంజాయి కలిపిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.