భారతీయ సమాజం సహజీవనాన్ని ఆమోదయోగ్యమైనదిగా గుర్తించదని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఈ సంబంధంలోకి అడుగుపెట్టి, అది విచ్చిన్నమైతే తరువాత మహిళ ఒంటరిగా జీవించడం కష్టమని అభిప్రాయపడింది.
లివ్ ఇన్ రిలేషన్ షిప్ ముగిసిన తర్వాత మహిళ ఒంటరిగా జీవించడం కష్టమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భారతీయ సమాజం పెద్దగా అలాంటి సంబంధాలను అంగీకరించదని, గుర్తించదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సహజీవన భాగస్వామిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు 2022 నవంబర్ 24న అరెస్టయిన ఓ వ్యక్తి బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ సిద్ధార్థ్.. ఆ మహిళకు న్యాయపరంగా వెళ్లడం తప్ప ఇతర మార్గాలు లేవని అన్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు మహిళలు తమ లివ్ ఇన్ భాగస్వాములపై కేసు పెట్టడం తప్ప మరో మార్గం ఉండదన్నారు.
ట్విట్టర్‌లో #HeartAttack ట్రెండింగ్ .. వైరల్ కావడానికి అసలు కారణమేంటీ ?
‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో వినాశకరమైన పరిణామాలు తెరపైకి వచ్చిన కేసు ఇది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ తెగిపోయిన తర్వాత మహిళ ఒంటరిగా జీవించడం కష్టం. భారతీయ సమాజం అలాంటి సంబంధాన్ని ఆమోదయోగ్యంగా గుర్తించదు. అందువల్ల ప్రస్తుత కేసులో మాదిరిగానే తన లివ్ ఇన్ పార్టనర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్ప ఆ మహిళకు మరో మార్గం లేదు’’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వార్తా సంస్థ ‘ఐఏఎన్ఎస్’ నివేదించింది.
ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఫిర్యాదు చేసిన మహిళకు గతంలోనే వివాహం అయ్యింది. నిందితుడితో లివ్-ఇన్ రిలేషన్ షిప్ లోకి ప్రవేశించే ముందే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది పాటు అతడితో ఆమె సహజీవనం చేసింది. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిందితుడు నిరాకరించాడు. అలాగే ఆ మహిళకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను ఆమె మాజీ భర్తకు పంపించాడని ఫిర్యాదులో ఆరోపించింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 406 (నమ్మక ద్రోహం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పెళ్లి రోజే.. వధువు మృతి.. అయినా ఆగని వివాహం.. పుట్టెడు దుఃఖంలో కఠిన నిర్ణయం..
ఇదిలా ఉండగా.. మహిళ మేజర్ అని, ఇష్టపూర్వకంగానే నిందితుడితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించిందని నిందితుడి న్యాయవాది వాదించారు. అలాంటి సంబంధం వల్ల కలిగే పర్యవసానాన్ని ఆమె అర్థం చేసుకోగలిగిందని పేర్కొన్నారు. అయితే నిందితుడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి సహజీవనం మొదలు పెట్టాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది మీడియాకు తెలిపారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. నేరం స్వభావం, సాక్ష్యాలు, నిందితుల ప్రమేయం, పక్షాల తరఫు న్యాయవాది వాదనలు, ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిందని ‘ఐఏఎన్ఎస్’ నివేదించింది.
