పిల్లాడి కోసం ఒంటె పాలను తెచ్చిన భారత రైల్వే
తన పిల్లవాడికి ఇతర జంతువుల పాలు పడవని, ఒంటె పాలు మాత్రమే కావాలని ఓ మహిళ ప్రధాని మోడీకి ట్యాగ్ చేస్తూ వినతి చేసింది. దీంతో భారత రైల్వే ఆమెకు ఒంటె పాలను సరఫరా చేసింది.
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి విస్తురిస్తున్న తరుణంలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతోంది. రైళ్లను నిత్యావసర సరుకులను రవాణా చేయడానికి మాత్రమే వాడుతున్నారు. ఈ కష్టకాలంలో భారత రైల్వే ముంబైలోని ఓ కుటుంబానికి 20 లీటర్ల ఒంటె పాలను సరఫరా చేసింది.
తమ మూడున్నరేళ్ల వయస్సు గల పుత్రుడికి మేక, ఆవు, బర్రె పాలు పడవని, ఒంటె పాలు దొరకవడం లేదని ఓ మహిళ చెప్పింది. దాంతో భారత రైల్వే ఆ పిల్లవాడి కోసం ఒంటెపాలను సరఫరా చేసింది. ఐపిఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్వీట్ చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది.
మూడున్నరేళ్ల వయస్సు గల కుమారుడి తల్లి రేణు కుమారి ప్రధాని నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ తన సమస్యను తెలిపింది. "సార్, నాకు 3.5 ఏళ్ల కుమారుడు ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. కొన్ని ఆహార పదార్థాలు అతనికి పడవు. ఒంటెపాలు మీద మాత్రమే జీవిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఒంటె పాలు లభించడం లేదు. సాద్రీ (రాజస్థాన్) నుంచి ఒంటెపాలను గానీ దాని పౌడర్ ను గానీ అందించండి" అని ట్వీట్ చేసింది.
బోత్రా ఆ విషయాన్ని ట్వీట్ చేయడంతో తమ దృష్టికి వచ్చిందని, ఆ విషయంపై అజ్మీర్ డీసీఎం మహేష్ చాంద్ జెవాలియాతో చర్చించామని, లూథియానాకు, ముంబైలోని బాంద్రాకు మధ్య నడుస్తున్న కార్గో రైలు ద్వారా దాన్ని రవాణా చేయడానికి నిర్ణయించుకున్నామని, హాల్ట్ లేకపోయినప్పటికీ ఆ రైలును రాజస్థాన్ లోని ఫాల్నా స్టేషన్ లో ఆపామని, ఆ ప్యాకేజీ తీసుకుని మహిళనకు అందించామని వాయవ్య రైల్వే చీఫ్ ప్యాసెంజర్ ట్రాఫిక్ మేనేజర్ తరుణ్ జైన్ చెప్పారు.
సంబంధిత అధికారులతో అనుమతి పొంది రైలును బాంద్రాలో ఆపి ఒంటె పాలను మహిళకు అందించామని ఆయన చెప్పారు. తాము ప్రజలకు అవసరమైనవాటిని అందిస్తున్నామని, ఇటువంటి సమయంలో వ్యాపార దృష్టితో వ్యవహరించలేమని అన్నారు.