భారత రైల్వేశాఖ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు. ఇటీవల కొన్ని రైళ్లకు అనుమతించారు అధికారులు.  ఒక్కరోజే కొన్ని వేల మంది రైల్వే బుకింగ్స్ కూడా చేసుకున్నారు.

జూన్ 30 వరకు ప్రయాణీకులు బుక్ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత రైల్వేశాఖ. డబ్బులు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కధనం ప్రచురితమైంది. దీనితో జూన్ 30 వరకు శ్రామిక్ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ మినహా ప్యాసింజర్ రైళ్లు తిరగవనే చెప్పాలి.

అయితే గతంలో బుక్ చేసుకున్న రైళ్ల టిక్కెట్లను మాత్రమే రైల్వేస్ రద్దు చేసింది. నూతనంగా రైల్వేస్ మొన్నటి నుండి నడుపుతున్న రైళ్లకు ఎటువంటి ఆటంకం లేదు. అవి యధావిధిగా నడుస్తాయి. 

కేవలం లాక్ డౌన్ కి మునుపు, రైళ్ల పునఃప్రారంభానికి ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లు మాత్రమే రద్దు అవుతాయని తెలిపింది రైల్వే శాఖ. నాలుగు నెలల ముందు నుంచే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కాబట్టి చాలామంది ఇలా బుక్ చేసుకున్నారు. వాటిని కాన్సల్ చేసినట్టు తెలిపారు అధికారులు. 

ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని రిపోర్టు తెలిపింది.  మరి ఈ నిర్ణయం రైల్వేశాఖ ఎందుకు తీసుకుందోనన్న విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.