వలస రాజ్యాల వారసత్వానికి చరమగీతం .. ‘‘లాఠీ’’లు మోసే పద్ధతి రద్దు : ఇండియన్ నేవీ సంచలన నిర్ణయం
ఇండియన్ నేవి సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటీష్ కాలం నాటి వలసవాద వారసత్వానికి చిహ్నాలుగా వున్న లాఠీ మోసే పద్దతికి చెక్ పెట్టింది. ఇకపై అధికారులు, సిబ్బంది లాఠీలు మోయకూడదని ఆదేశించింది.

స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు గడుస్తున్నా ఇప్పటికీ మనదేశంలో బ్రిటీష్ పాలన నాటి వాసనలు పోవడం లేదు. తెల్ల దొరల కాలంలో చేసిన కీలక చట్టాలు, సంస్కరణాలను నేటికీ ఉపయోగిస్తోంది భారతదేశం. వీటిని రద్దు చేయాలని , లేదా మార్పు చేయాలని దేశంలోని మేధావులు ఎన్నో సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా వలసరాజ్యాల వారసత్వాన్ని పారద్రోలేందుకు గాను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, భారత నావికాదళం దాని సిబ్బంది అందరూ లాఠీలు మోసే పద్ధతికి చరమగీతం పడింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలుల్లోకి వస్తాయని ఇండియన్ నేవి స్పష్టం చేసింది.
శుక్రవారం భారత నౌకాదళం జారీ చేసిన ఒక కమ్యూనికేషన్ ప్రకారం.. “కాలం గడిచేకొద్దీ, నావికాదళ సిబ్బంది లాఠీలను మోసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. లాఠీ పట్టుకోవడం అనేది అధికారం లేదా శక్తికి ప్రతీక. నౌకాదళంలో ఇకపై వలస వారసత్వానికి చోటు లేదు’’ అని పేర్కొంది. ఈ ఆదేశాల ప్రకారం.. ప్రోవోస్ట్ (చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్) , ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది లాఠీలను మోసుకెళ్లడం తక్షణమే నిలిపివేయ బడుతుందని ఇండియన్ నేవి పేర్కొంది. అయితే ప్రతి యూనిట్ అధిపతి కార్యాలయంలో మాత్రం తగిన విధంగా లాఠీని వుంచాలని ఆదేశించింది. కమాండ్ బదిలీ, కొత్త కమాండ్ బాధ్యతలు తీసుకునే సమయంలో లాఠీ మార్పును ఉత్సవంలా చేపట్టాలని సూచించింది.
కాగా.. భారత రక్షణ దళాలు వలసవాద యుగం నాటి వారసత్వ స్మృతులను, చిహ్నాలను తొలగించడానికి అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భారత నావికాదళం తన చిహ్నాన్ని కూడా మార్చుకుంది. ఇండియన్ నేవి కొత్త చిహ్నం (నిషాన్)ను ప్రధాని నరేంద్ర మోడీ గతేడాది ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీకి చెందిన ముద్ర నుంచి ప్రేరణగా తీసుకుని దీనిని కొత్త చిహ్నాన్ని రూపొందించారు.