బల్జీత్ కౌర్‌తో సహా ఐదుగురు అధిరోహకులు అన్నపూర్ణ పర్వతం చుట్టూ ఉన్న వివిధ శిబిరాల నుండి రక్షించబడ్డారు. ఈ మేరకు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ : నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతంలోని క్యాంప్ IV సమీపంలో తప్పిపోయిన 27 ఏళ్ల భారతీయ మహిళా పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ ను మంగళవారం నాడు రక్షించారని అధికారి తెలిపారు. "బల్జీత్ కౌర్ ఫ్రాస్ట్‌బైట్‌తో బాధపడుతోంది. ఇప్పుడు ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సిఐడబ్ల్యూఈసీ ఆసుపత్రికి ఆమెను తరలించారు" అని పయనీర్ అడ్వెంచర్ ఛైర్మన్ పసాంగ్ షెర్పా చెప్పారు.
పసాంగ్ షెర్పా చెప్పిన దాని ప్రకారం, బల్జీత్ కౌర్ 7,363 మీటర్ల ఎత్తు నుండి రక్షించబడింది. పర్వాతారోహకులు మిస్సింగ్ తరువాత.. రంగంలోకి దిగిన సెర్చ్ టీం క్యాంప్ IV పైన ఆమె ఉన్న లొకేషన్ ను ట్రేస్ చేశారు. బల్జీత్ కౌర్ సప్లిమెంటరీ ఆక్సిజన్‌ను ఉపయోగించకుండా ప్రపంచంలోనే 10వ ఎత్తైన అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించారని పసాంగ్ షెర్పా చెప్పారు.
నేపాల్‌లోని మౌంట్ అన్నపూర్ణపై భారతీయ పర్వతారోహకుడు మిస్సింగ్.. ముమ్మర గాలింపులు
IV క్యాంప్ వైపు ఒంటరిగా దిగుతున్న మహిళా పర్వతారోహకురాలిని సెర్చ్ టీమ్ గుర్తించిందని ఆయన తెలిపారు. సోమవారం బల్జీత్ కౌర్ తప్పిపోయిన తర్వాత ఆమెతో రేడియో సంబంధాలు కూడా తెగిపోయాయని.. కానీ, ఆమె మంగళవారం ఉదయం ఎలాగో SOSను పంపగలిగిందని తెలిపారు. దీంతో ఆమెను రక్షించడానికి మూడు హెలికాప్టర్‌లను రంగంలోకి దించాలని అధికారులను కోరారు.
ఆమె జీపీఎస్ లొకేషన్ 7,375 మీటర్లు (24,193 అడుగులు) ఎత్తులో ఉన్నట్లు చూసించిందని షెర్పా చెప్పారు. మొత్తానికి, బల్జీత్ కౌర్‌తో సహా ఐదుగురు పర్వతారోహకులు అన్నపూర్ణ పర్వతం చుట్టూ ఉన్న వివిధ శిబిరాల నుండి రక్షించబడ్డారు. నార్తర్న్ ఐరిష్ అధిరోహకుడు నోయెల్ హన్నా మృతదేహాన్ని క్యాంప్ IV నుండి ఖాట్మండుకు తీసుకువచ్చారు.
రక్షించబడిన మిగతా ముగ్గురిలో భారత్‌కు చెందిన అర్జున్ వాజ్‌పేయ్, పాకిస్థాన్‌కు చెందిన షెహ్రోజ్ కాషిఫ్, నైలా కియానిలు ఉన్నారు. మరో భారతీయ పర్వతారోహకుడు రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ మాలు అదృశ్యమయ్యాడు.
"హిమాచల్ ప్రదేశ్ ముద్దుబిడ్డ అయిన బల్జీత్ కౌర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో భారతదేశం, తన రాష్ట్రం గర్వించేలా చేసింది" అని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ పర్వతం, ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం, K2, నంగా పర్బత్‌లతో పాటు శిఖరాగ్ర శిఖరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
