స్థానిక భాషల్లో మాట్లాడే వారితో పోలిస్తే "ఇంగ్లీష్ మాట్లాడే లాయర్లు" ఎక్కువ ఫీజులు తీసుకోవడం పట్ల న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఢిల్లీ : హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి విదేశీ విశ్వవిద్యాలయాలలో చదువుకున్న భారతదేశంలోని చాలామంది మంచి న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇంగ్లీష్ లోనే ఆలోచిస్తారు, మాట్లాడతారు. అంతవరకు ఓకే కానీ.. వారు తమ ఆలోచనలలో "భారతీయులు"గా ఉండటమే ముఖ్యమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మంగళవారం అన్నారు. ఇలాంటి ఇంగ్లిష్ మాట్లాడే లాయర్లకు తమ ఆలోచనల్లోనూ విదేశీయతను కలిగి ఉండటం సరికాదన్నారు.
“ఇంగ్లీషులో ఆలోచించే, ఇంగ్లీషులో మాట్లాడే న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. కానీ వీరికి విదేశీ భాషతో పాటు, విదేశీ ఆలోచనలు ఉండడం సరికాదు. మీరు ఏదైనా విశ్వవిద్యాలయం నుండి చదివి ఉండవచ్చు - హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్. మంచి న్యాయవాది కావచ్చు. న్యాయమూర్తి అవ్వొచ్చు. కానీ మనసులో ఆలోచనల పరంగా భారతీయులుగా ఉండాలి, తద్వారా మీరు వినయంగా ఉంటారు”అని మంత్రి అన్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేశారు.స్థానిక భాషల్లో మాట్లాడే వారితో పోల్చితే "ఇంగ్లీష్ మాట్లాడే లాయర్లు" ఎక్కువ ఫీజులు తీసుకోవడం పట్ల కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లీషుపై వారికి ఉన్న కమాండ్ ఆధారంగా లాయర్లకు చెల్లింపుల గురించి ఢిల్లీ కోర్టులో చేసిన వ్యాఖ్యను ఆయన ఉదహరించారు.
ఎస్ యూవీ, ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి, పలువురికి గాయాలు.. ఎక్కడంటే ?
ఇంగ్లీషు బాగా మాట్లాడే న్యాయవాది కంటే భారతీయ భాషల్లో మాట్లాడే న్యాయవాదులు సమర్థులు అన్న వాస్తవాన్ని విస్మరించడం సరికాదని రిజిజు అన్నారు. “సుప్రీం కోర్ట్‌లో కొంతమంది న్యాయవాదులు ఉన్నారు, వారి న్యాయ పరిజ్ఞానంతో సంబంధం లేకుండా, వారు మంచి ఇంగ్లీషు మాట్లాడటం వల్ల ఎక్కువ జీతం పొందుతారు. మంచి ఇంగ్లీషులో మాట్లాడటం వల్ల ఎక్కువ జీతం పొందడం సరికాదు. ఒక్కసారి ఆలోచించండి, మరాఠీ, హిందీ భాషలలో మంచి పట్టు ఉన్న లాయర్లు ఉన్నారు, కానీ వారి ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే వారు ఇంగ్లీష్ లో మాట్లాడలేరు”అని అన్నారు.
ఇలాంటి ధోరణి దేశానికి మంచిది కాదని, న్యాయవాదులు ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మన న్యాయస్థానాలు భారతీయ భాషల కంటే ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని రిజిజు అన్నారు. అందువల్ల, కోర్టు కార్యకలాపాల విషయంలో మరిన్ని ప్రాంతీయ భాషలలో జరిగేలా చూడాలని ఆయన సుప్రీంకోర్టుకు సూచించారు.
“భారత న్యాయస్థానాలలో మన స్వంత భాషలను ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? మహారాష్ట్రలో మరాఠీని ఎందుకు ఉపయోగించకూడదు? మీరు ఈ దిశగా ఆలోచించడం ప్రారంభించండి అని సుప్రీంకోర్టును కూడా కోరాం. దేశంలోని అన్ని హైకోర్టులలో కూడా... ఆ రాష్ట్ర భాషను ఉపయోగించాలనే ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది”అని రిజిజు అన్నారు.
దేశంలో సాంకేతికత ఉందని, దీని ద్వారా న్యాయమూర్తి చెప్పినదానిని తక్షణమే ట్రాన్స్ లేట్ చేయచ్చు. మహారాష్ట్రలోని 384 బార్ అసోసియేషన్లకు ఇ-ఫైలింగ్ యూనిట్లు, ఫెసిలిటీ సెంటర్ల పంపిణీ కోసం ముంబైలో బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రతి యూనిట్‌లో కంప్యూటర్, ప్రింటర్ స్కానర్ ఉంటాయి.
ఇ-ఫైలింగ్‌ను తప్పనిసరి చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఇది జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చుల కారణంగా యూనిట్లను స్వయంగా పంపిణీ చేయాలని బార్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా రిజిజును యువ న్యాయవాదులు ప్రేక్షకుల నుండి కొన్ని ప్రశ్నలు అడిగారు.
కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటుందా అనేది మరో ప్రశ్న. దీనికి సమాధానంగా ‘‘నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రతను హరించేలా లేదా దాని అధికారాలను అణగదొక్కేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని రిజిజు స్పందించారు.
ఆయన మరో అడుగు ముందుకేసి కార్యనిర్వాహక పనిలో న్యాయవ్యవస్థ జోక్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత న్యాయవాదిని కోరారు.
"‘‘న్యాయవ్యవస్థ స్వతంత్రత ఐసోలేట్ అవుతుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. న్యాయవ్యవస్థ స్వతంత్రత, ఎగ్జిక్యూషన్, లెజిస్లేషన్ అనేవి రాజ్యాంగంలోని మూడూ ముఖ్య భాగాలు. ఈ మూడింటికినీ రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామిక అధికారాలను గుర్తించింది. అయితే ఇవన్ని 'లక్ష్మణ రేఖ' పరిధికి లోబడి పనిచేయడం ముఖ్యం" అని మంత్రి వివరించారు.
