భారతదేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 360 కి.మీ నిర్మాణం పూర్తయిందని చెప్పుకొచ్చారు. భారత్‌లో తొలి హైస్పీడ్ రైలు ఎప్పుడు అందుబాటులోకి రానుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇండియాలో ఫస్ట్ హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటివరకు 360 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర సెక్షన్లలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన రైల్వే శాఖమంత్రి పలు విషయాలను పంచుకున్నారు. 

ఆలస్యానికి అసలు కారణం అదే:

బుల్లెట్ రైలు పనులు గుజరాత్‌లో వేగంగా జరగడానికి మహారాష్ట్రలో నెమ్మదిగా జరగడానికి కారణం ఉద్దవ్‌ థాకరే ప్రభుత్వం సరైన సమయంలో అనుమతులు ఇవ్వకపోవడమే కారణమని మంత్రి తెలిపారు. ఈ కారణంగానే పనులు రెండున్నరేళ్లు ఆలస్యమయ్యాయని మంత్రి వైష్ణవ్ చెప్పారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రాలో బీజేపీ ప్రభుత్వం రావడంతో పనులు జెట్‌ స్పీడ్‌తో ముందుకు సాగుతున్నాయని అన్నారు. 

జపాన్‌ తరహా మోడల్‌లో: 

బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా స్టేషన్, హైవే, బ్రిడ్జ్, అండర్ వాటర్ టన్నెల్ వంటి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మహారాష్ట్ర సెక్షన్‌లో కూడా ఇప్పుడు పనుల్లో వేగం పెరిగిందన్నారు. దాదాపు 2 కిలోమీటర్ల అండర్ వాటర్ టన్నెల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇక జపాన్‌లోని టోక్యో-ఒసాకా బుల్లెట్ ట్రైన్ కారిడార్ తరహాలోనే ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ద్వారా నగరాల అభివృద్ధి జరుగుతుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్‌లో ఉదయం టిఫిన్‌ చేసిన బయలుదేరితే ముంబయిలో వ్యాపారం చేసుకొని కాసేపు సరాదాగా గడిపి మళ్లీ సాయంత్రానికి రిటర్న్‌ అవ్వొచ్చన్నమాట. 

బుల్లెట్‌ ట్రైన్‌ వస్తే జరిగే లాభం ఏంటి.? 

ముంబయి నుంచి అహ్మదబాద్‌కు సుమారు 508 కి.మీల ప్రయాణం ఉంటుంది. ఈ రైలు గంటకు ఏకంగా 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ లెక్కన ముంబయి, అహ్మదాబాద్‌ల మధ్య ప్రయాణ సమయం కేవలం సుమారు 2 గంటలే ఉండనుంది. మొత్తం 35 ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రతీ 20 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండనుందన్నమాట. సబర్మతిలో ఈ ప్రాజెక్టుకు ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. 

ఎంత మందికి ఉద్యోగాలు రానున్నాయి.? 

అహ్మదాబాద్ కలుపూర్ స్టేషన్ మెగా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్‌ను నాలుగేళ్లలో రీడెవలప్ చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు. అహ్మదాబాద్ సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని కొత్త డిజైన్ చేశారు. మూడు లెవెల్స్ (గ్రౌండ్, కాన్‌కోర్స్, ప్లాట్‌ఫామ్ లెవెల్)తో ఈ స్టేషన్ ఇండియాలోనే మోడ్రన్ రైల్వే స్టేషన్లలో ఒకటిగా రూపొందిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టు ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఇది ఇండియాకు చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.