జమ్ము కశ్మీర్‌లో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆర్మీ ఆవిష్కరించింది. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన అసంఖ్యాక సైనికులక నివాళిగా ఈ పతాకాన్ని ఆవిష్కరించినట్టు ఆర్మీ తెలిపింది. 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో 100 అడుగుల ఎత్తులో రెపరెపలాడేలా జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఉగ్రవాద ముప్పు అధికంగా ఉన్న చినాబ్ లోయ రీజియన్‌లో ఈ జెండాను ఏర్పాటు చేశారు. సుమారు దశాబ్దం క్రితం ఇక్కడ ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచేశారు. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండే దొడా జిల్లాలో ఈ జెండాను ఇన్‌స్టాల్ చేశారు. తాజాగా, ఈ జాతీయ పతాకాన్ని భారత ఆర్మీ ఆవిష్కరించింది. చినాబ్ వ్యాలీ రీజియన్‌లో ఇది రెండో అతి పెద్దదైనా జెండా. గత ఏడాది జులైలో సమీపంలోని కిష్టవార్ పట్టణంలో 100 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు.

దొడ స్పోర్ట్స్ స్టేడియంలో అతి పొడవైన ఫ్లాగ్ పోల్‌పై భారత జాతీయ పతాకాన్ని ఆర్మీ డెల్టా ఫోర్స్ మేజర్ జనరల్ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. సెక్టార్ 9 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్ బ్రిగ్ సమీర్ కే పాండే, దొడా డిప్యూటీ కమిషనర్ విశేశ్ పౌల్ మహాజనన్, ఎస్ఎస్‌పీ అబ్దుల్ ఖయూమ్‌లు కలిసి ఈ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర జవానులకు నివాళిగా ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నట్టు మేజర్ జనరల్ అజయ్ కుమార్ తెలిపారు.

Also Read: పుల్వామా అమరవీరుల భార్యలపై రాజస్థాన్ పోలీసుల దాడి.. విచారణకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్

దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలను ఈ సందర్భంగా సత్కరించారు. వారితోపాటు దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న పౌర సమాజ ప్రతినిధులనూ సన్మానించారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడటానికి ప్రాణాలు వదిలిన అసంఖ్యాక జవాన్లకు నివాళి గా ఈ ఎత్తైన జెండాను ఆవిష్కరించినట్టు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫ్ ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ జెండా ఎత్తైన ప్రాంతంలో వంద అడుగుల ఎత్తులో రెపరెపలాడుతున్నదని, చాలా దూరం వరకు ఈ పతాకం కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పతాకం చూసిన వారికి దేశం పై ప్రేమ, గర్వం కలుగుతుందని వివరించారు.