దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రక్షణ శాఖ సైన్యంలో భారీగా జవాన్ల రిక్రూట్ మెంట్ చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 70 వేల సైనిక ఉద్యోగాల భర్తీ కోసం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని భావించే యువత సద్వినియోగం చేసుకోవాలని ఆర్మీ అధికారులు సూచించారు. 

హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలోని సీఆ‌ర్‌ఫిఎప్ గ్రూప్ సెంటర్‌లో జవాన్ల శిక్షణ ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సౌత్‌సెక్టార్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్‌ఫిఎప్ లో 22 వేలు, బీఎస్‌ఎఫ్‌లో 19 వేల ఉద్యోగాలతో పాటు మరిన్ని విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీతో పాటు అన్ని కేటగిరీల వారు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆయన తెలిపారు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే, కేవలం ఐదు కిలోమీటర్ల పరుగు పందెం, ఓ రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ఐజీపి రాజు తెలిపారు.

దేశ వ్యాప్తంగా చేపట్టిన ఈ భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ లో తెలుగు రాష్ట్రాల యువత సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ఎం.రఘురాం, సీఆర్‌పీఎఫ్‌ ఏటీసీ కమాండర్‌ అమర్‌సింగ్‌ మీనాతతో ఆర్మీ అధికారులు, జవాన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, జవాన్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.