Asianet News TeluguAsianet News Telugu

అధికారులు సహకరించడం లేదు... ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్ ఆపేస్తాం : పంజాబ్‌కు సర్కార్‌కు తేల్చిచెప్పిన ఆర్మీ

అగ్నిపథ్‌ కార్యక్రమానికి స్థానిక అధికార యంత్రాంగం సహకరించడం లేదని ఇండియన్ ఆర్మీ ఆరోపించింది. ఇలాగే జరిగితే రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ నిలిపివేస్తామని పంజాబ్ ప్రభుత్వానికి ఆర్మీ అధికారులు లేఖ రాశారు. 
 

 Indian Army may suspend Agnipath recruitment rallies amid no local administration support in Punjab
Author
First Published Sep 14, 2022, 2:38 PM IST

భారత త్రివిధ దళాల్లోకి అగ్నిపథ్ పథకం ద్వారా సైనికులను రిక్రూట్‌ చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. తొలుత దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినప్పటికీ.. తర్వాత యువత నుంచి ఈ స్కీమ్‌కి మంచి స్పందన వస్తోంది. లక్షలాది మంది త్రివిధ దళాల్లోకి చేరేందుకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు భారీగా హాజరవుతున్నారు. అయితే కొన్ని చోట్ల అగ్నిపథ్‌కు స్థానిక ప్రభుత్వాలు అంతగా సహకరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

తాజాగా పంజాబ్‌ ప్రభుత్వంపై భారత సైన్యం విమర్శలు గుప్పించింది. పంజాబ్‌లోని స్థానిక అధికార యంత్రాంగం సహకరించడం లేదని.. ఇలాగే జరిగితే రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేస్తామని ఆర్మీ అధికారులు తేల్చిచెప్పారు. ఈ మేరకు పంజాబ్‌ సీఎస్‌కు జలంధర్‌లోని జోనల్ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్ మేజర్ జనరల్ శరద్ బిక్రమ్ సింగ్ లేఖ రాశారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించి స్థానిక అధికారులు , పోలీసులు తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని, అలాగే నిధులు లేవని చెబుతున్నారని బిక్రమ్ సింగ్ లేఖలో పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌కు స్థానిక యంత్రాంగం సహకారం అవసరమని, అభ్యర్ధులను నియంత్రించడం, భత్రత కల్పించడమన్నది స్థానిక పోలీసుల బాధ్యత అని ఆయన తెలిపారు. 

వీటితో పాటు టెంట్లు, తాగునీటి సదుపాయం, మల, మూత్ర విసర్జన శాలలు, భోజనం, తక్షణ వైద్య చికిత్స, అంబులెన్స్ వంటి సదుపాయాలను కల్పించాల్సిన అవసరముందని బిక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి లేదని ఆయన పేర్కొన్నారు. లేనిపక్షంలో ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌ దృష్టికి విషయం తీసుకెళ్లి.. పంజాబ్‌లో రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేయిస్తానని బిక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. మరి దీనిపై భగవంత్ మాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios