కరోనా వైరస్‌తో ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. దీని బారి నుంచి మానవాళిని కాపాడేందుకు డాక్టర్లు, పోలీస్, పారిశుద్ధ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు మరణించగా.. కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వారు చేస్తున్న సేవలకు గాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ధన్యవాదాలు తెలిపారు. కరోనాతో పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, హోంగార్డులు తదితరులు అందరికీ త్రివిధ దళాల తరపున సీడీఎస్ కృతజ్ఞతలు చెప్పారు.

Also Read:లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగింపు: ఉత్తర్వులు జారీ

శుక్రవారం త్రివిధ దళాల అధిపతులతో కలిసి ఢిల్లీలో ఆయన సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ మాట్లాడుతూ... ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోంది... దీనికి మనదేశం సైతం అతీతం కాదు, కానీ కలిసికట్టుగా దీనిపై గెలుస్తామనే నమ్మకం ఉందని ఆయన ఆకాంక్షించారు.

కోవిడ్ 19 వారియర్స్‌కు సంఘీభావంగా మే 3న ఎయిర్‌ఫోర్స్ విమానాలు శ్రీనగర్ నుంచి తిరువనంతపురం, డిబ్రూగఢ్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు పూలు జల్లుతాయని బిపిన్ రావత్ చెప్పారు.

మే 3న సాయంత్రం తీరాల్లో యుద్ధ నౌకలన్నీ విద్యుత్ వెలుగులతో కనిపిస్తాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా నేవీ హెలికాఫ్టర్లు ఆకాశం నుంచి పూలు జల్లుతాయని రావత్ వెల్లడించారు.

ఆర్మీ మౌంటెయిన్ బ్యాండ్ ప్రదర్శనలు ఇస్తుందని.. అలాగే పోలీస్ స్మారకాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తుందని తెలిపారు. మరోవైపు త్రివిధ దళాలపై కరోనా వైరస్ ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు రావత్ ప్రకటించారు.

Also Read:కరోనా రోగులకు చికిత్స చేసిన డాక్టర్ కు ఘన స్వాగతం: వీడియో షేర్ చేసిన మోడీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో పోరాడుతున్న సాయుధ దళాల సిబ్బంది తమకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి, ప్రజలకు మద్ధతుగా నిలవటానికి వీలుగా వారు వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బిపిన్ రావత్ సూచించారు.

ఆర్మీలో కోవిడ్ 19 బారినపడిన మొట్టమొదటి జవాన్‌ ఇప్పుడు కోలుకున్నాడని, అతనికి పూర్తిగా నయమైందని ఆర్మీ జనరల్ మనోజ్ ఎం నరవానె వెల్లడించారు.