దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి వ్యాక్సిన్‌ అందజేస్తామన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావదేకర్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే వ్యాక్సినేషన్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ సిద్ధం చేసిందని తెలిపారు. డిసెంబర్‌ చివరినాటికి దేశంలోని 108 కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్‌ అందుతుందని జావదేకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు.

ముందు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని ఆయన చురకలంటించారు. ఆయా రాష్ట్రాల్లో టీకాల కార్యక్రమంలో గందరగోళం నెలకొందని ఆరోపించారు. మే 1 నుంచి 18-44 వయసువారికి టీకా వేసేందుకు ఉద్దేశించిన కోటాను ఆ రాష్ట్రాలు తీసుకోలేదని జావదేకర్ వ్యాఖ్యానించారు. కొవిడ్‌ కట్టడిలో కేంద్రం విఫలమైందని, 3 శాతం ప్రజలకు కూడా ఇంకా వ్యాక్సిన్‌ పూర్తవ్వలేదంటూ రాహుల్‌ విమర్శలు చేసిన నేపథ్యంలో జావదేకర్ కౌంటరిచ్చారు.

Also Read:మోడీ ఒక ఈవెంట్ మేనేజర్‌.. కోవిడ్‌ను కూడా ఈవెంటే అనుకున్నారు: రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

అలాగే ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన టూల్‌ కిట్‌ వ్యవహారంపైనా జావదేకర్ స్పందించారు. రాహుల్‌ వాడిన భాష చూస్తుంటే ఆ టూల్‌కిట్‌ కాంగ్రెస్‌ రూపొందించిందనేది స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. ప్రజల్లో భయాందోళన నెలకొల్పడానికి కాంగ్రెస్ చేస్తున్న రాజకీయంలో భాగమే ఇదంటూ ప్రకాశ్ జావదేకర్ మండిపడ్డారు. టూల్‌కిట్‌ కాంగ్రెస్‌దే అనడానికి ఇంతకుమించిన సాక్ష్యాలు అవసరం లేదని ఆయన అన్నారు. దేశీయంగా తయారైన టీకాపై లేనిపోని సందేహాలు అప్పట్లో లేవనెత్తారని, అదే వ్యక్తులు ఇప్పుడు వ్యాక్సినేషన్‌ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేంద్రమంత్రి దుయ్యబట్టారు.