దేశంలో కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మోడీ కానీ, కేంద్రం కానీ కోవిడ్ సమస్యను సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ మాట్లాడుతూ, కోవిడ్ కేవలం విస్తరిస్తున్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యుఘంటికలు మోగిస్తుందని అన్నారు. వ్యాక్సిన్స్ వ్యూహాన్ని కేంద్రం సరిగా అమలు చేయకుంటే భారత్‌ మరిన్ని కోవిడ్ వేవ్‌లను చవిచూడాల్సి వస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:కరోనా వ్యాక్సినేషన్‌పై వ్యూహం లేదు: మోడీకి రాహుల్ లేఖ

కరోనా వైరస్‌పై పోరాటంలో లాక్‌డౌన్ ఉపకరిస్తుందని.. అయితే లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం అనేవి కోవిడ్‌పై పోరాటంలో తాత్కాలిక వ్యూహాలు మాత్రమేనన్నారు. దేశం నుంచి కరోనాను తరిమికొట్టాలంటే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమే ఏకైక మార్గమని రాహుల్ హితవు పలికారు. కోవిడ్ వైరస్ మ్యుటేషన్‌కు అవకాశం ఇవ్వకుండా సక్రమంగా వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ విజ్ఞప్తి చేశారు. అలా కాని పక్షంలో మూడు, నాలుగుతో పాటు చాలా వేవ్‌లను భారత్ ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు.

మరోవైపు కోవిడ్ వల్ల భారత్‌లో మరణాలు చోటుచోవడానికి కేంద్రం, ప్రధాని మోడీయే బాధ్యులని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో కోవిడ్ సెకెండ్ వేవ్ వెనుక ప్రధాని 'నాటకమే' కారణమన్నారు. కేంద్రం చెబుతున్న మరణాల రేటు పూర్తిగా అబద్ధమని, ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధానిని ఈవెంట్ మేనేజర్‌గా అభివర్ణించిన రాహుల్ ... ''కోవిడ్ వ్యూహాన్ని మోడీ సరిగ్గా అవగాహన చేసుకోలేదని... ఆయనకు ప్రతీదీ ఒక ఈవెంటే'' అంటూ ఫైరయ్యారు.