New Delhi: విశ్వభారతి స్నాతకోత్సవంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ నాలుగైదు సంవ‌త్స‌రాల‌లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. 

Defence minister Rajnath Singh: భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. విశ్వభారతి స్నాతకోత్సవంలో పాలుపంచుకున్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. నాలుగైదు సంవ‌త్స‌రాల‌లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్య‌క్తంచేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. పశ్చిమబెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం వార్షిక స్నాతకోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే నాలుగైదేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని అన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.

విజ్ఞానం, సైన్స్, తత్వశాస్త్ర రంగాల్లో మరోసారి దేశానికి కొత్త తోడ్పాటును అందించేందుకు పశ్చిమబెంగాల్ ను మళ్లీ మేల్కొల్పాల్సిన అవసరం ఉందని తాను అర్థం చేసుకున్నానని రక్షణ మంత్రి అన్నారు. విశ్వభారతిని "విద్యా దేవాలయం"గా అభివర్ణించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, భారతదేశం ప్రపంచాని మ‌రోసారి మార్గం చూపుతున్న‌ద‌నీ, దాని వ్యవస్థాపకుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వలె మానవతావాదిగా ఉండాలని అక్క‌డున్న విద్యార్థుల‌ను ఆయ‌న కోరారు. ర‌వీంద్రుని ఆలోచనలు, తత్వశాస్త్రం భారతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయ‌ని తెలిపారు. 

విద్యార్థులు, అధ్యాపకులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. 'జాతీయవాదం ప్రాదేశికంగా ఉండదని ఠాగూర్ మాకు చూపించారు. అది మన బహుళ సంస్కృతిపై ఆధారపడి ఉండాలి. పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించడానికి ఆయన విద్యాల‌యాన్ని స్థాపించారు' అని మంత్రి పేర్కొన్నారు. జీవితంలో చెప్పుకోదగినది ఏదైనా చేయాలనీ, అది దేశానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. నూతన విద్యావిధానం 2020 యువత సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఉద్ఘాటించారు. పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల‌ పెంపకంపై ఆధారపడి ఉంటుంద‌ని తెలిపారు. శాస్త్రవేత్తగా, ఇంజనీర్ గా, సంస్కరణవాదిగా, సామాజిక శాస్త్రవేత్తగా, కళాకారుడుగా జీవితంలో ఏవారైనా గురుదేవ్ చెప్పిన విలువలను ప్రతిబింబించాలని అన్నారు.

అలాగే, బెంగాల్ లో రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నాయనీ, ఒకటి గంగా సాగర్, మరొకటి విశ్వభారతి అని అన్నారు. సంఘ సంస్కర్త గోపాల కృష్ణ గోఖలే మాటలను గుర్తు చేస్తూ - "బెంగాల్ ఈ రోజు ఏమి ఆలోచిస్తుందో, భారతదేశం రేపు అదే ఆలోచిస్తుంది, దేశానికి నాయకత్వం వహించడానికి సైన్స్, టెక్నాలజీ వంటి రంగాలలో రాష్ట్రం మ‌రోసారి మేల్కొల్పాల్సిన అవసరం ఉంది" అని మంత్రి అన్నారు. కవి, రచయిత, స్వరకర్త, తత్వవేత్త అయిన ఠాగూర్ సామాజిక సంస్కరణల ద్వారా, మహిళా సాధికారత ద్వారా పరివర్తన తీసుకురావాలని విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. గొప్ప మానవతావాది మార్గదర్శనాన్ని భారత్ అనుసరిస్తోందని ఆయన పేర్కొన్నారు. 'గురుదేవ్ భారత జాతీయవాదాన్ని ప్రతిబింబించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత బ్రిటిష్ పాలకులు తనకు ఇచ్చిన నైట్ హుడ్ గౌరవాన్ని తిరిగి ఇచ్చిన వ్యక్తి ఆయనే.." అని కొనియాడారు.

ఇదిలావుండగా, గురువారం సాయంత్రం విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా వామపక్ష విద్యార్థి బృందాన్ని అడ్డుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ క్యాంపస్ లో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.