Unemployment Rate In India: భారత్ లో నిరుద్యోగం నానాటీ పెరుగుతోంది. ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 7.83 శాతానికి పెరిగింది, ఇది అంతకు ముందు నెలలో 7.60 శాతంగా ఉంది. హర్యానాలో నిరుద్యోగిత రేటు 34.5 శాతానికి చేరుకుంది, రాజస్థాన్ ఈ జాబితాలో 28.8 శాతంతో రెండవ స్థానంలో ఉంది. ఏప్రిల్‌లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 9.22 శాతానికి చేరుకోగా.. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.18 శాతానికి తగ్గిందని సీఎంఐఈ నివేదించింది 

Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ ఏడాది మార్చిలో 7.6%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌కు 7.83 శాతానికి పెరిగిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE ) వెల్లడించింది. గ్రామీణా ప్రాంతాల్లో కంటే ప‌ట్ట‌ణాల్లో నిరుద్యోగిత రేటు చాలా ఎక్కువ‌గా ఉంది. మార్చిలో నిరుద్యోగిత రేటు 8.28 శాతంగా ఉండ‌గా.. అదే ఏప్రిల్ నెలలో 9.22 శాతంగా న‌మోదైంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు తగ్గుదలని చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చిలో 7.29 శాతంగా ఉండ‌గా.. ఏప్రిల్‌లో 7.18 శాతంగా న‌మోదైంది.

ఇక రాష్ట్రాల ప‌రంగా చూస్తే.. హర్యానాలో నిరుద్యోగిత రేటు అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ నిరుద్యోగం రేటు 34.5 శాతానికి చేరుకుని ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఇక త‌రువాత స్థానంలో రాజస్థాన్ 28.8 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం వరుసగా 0.2%, 0.6%, 1.2% చొప్పున తక్కువ నిరుద్యోగిత రేటు నమోదు చేసుకున్నాయి. ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నట్టు CMIE పేర్కొన్నది. దేశీయంగా డిమాండ్‌ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. నిరుద్యోగ రేటు..ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే.. దేశంలోని మొత్తం జనాభాలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో తెలియజేస్తుంది. ద్ర‌వ్యోల్భ‌ణంపై కూడా నిరుద్యోగిత ప్ర‌భావం ఉంటుంది.

ద్రవ్యోల్బణం

మార్చి నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతానికి పెరిగింది, ఇది ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను చూపుతుంది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 6.07 శాతంగా ఉంది. కాగా, ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.85 శాతం నుంచి మార్చి నెలలో 7.68 శాతానికి పెరిగింది. మార్చిలో ఏడాది ప్రాతిపదికన, ఆహార నూనెల ధర 18.79 శాతం పెరిగింది, దీని కారణంగా ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఉంది. మరోవైపు మార్చిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ)ద్రవ్యోల్బణం 6.95%తో 17 నెలల గరిష్ఠానికి చేరుకున్నది. ఈ ఏడాది ఆఖరుకు 7.5%కి చేరుకోవచ్చనేది అంచనా. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ఠం 14.55%కి చేరుకున్నది. 

నిరుద్యోగిత రేటు ఎలా నిర్ణయించబడుతుంది?

డిసెంబరులో 7.83% ఉన్న నిరుద్యోగిత రేటు అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి 1000 మంది కార్మికులలో 78 మందికి పని దొరకడం లేదు. CMIE ప్రతి నెలా 15 ఏళ్లు పైబడిన వ్యక్తుల ఇంటింటికి సర్వే నిర్వహిస్తుంది. వారి ఉద్యోగ స్థితి గురించి ఆరా తీస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఫలితాల నుంచి నివేదిక తయారు చేస్తారు.